4596..గజల్.
చిరునవ్వే ధనమైతే..పంచుకోగ బలమందును..!
సహనం నీ ఇల్లైతే..నేర్చుకోగ బలమందును..!
విజయానందం సరెలే..అపజయమది ఉన్నదెచట..
సహృదయతే తోడైతై..ఓర్చుకోగ బలమందును..!
నిజసాక్షిగ ఉన్న శ్వాస..గురువన్నది సత్యమోయి..
వెలుగుతేనె మనసైతే..పట్టుకోగ బలమందును..!
నిన్నటి తనువే ఉపాధి..ఎఱుకలోన జీవించగ..
మౌనం నీ మధువైతే..నవ్వుకోగ బలమందును..!
ఎవరి ముద్ర ఎవరిమీద..పనిచేయదు గమనిస్తే..
అహమన్నది తొడుగైతే..వదులుకోగ బలమందును..!
ప్రతిభ వెలికి తీసుకునే..ముచ్చటయే ధ్యానమోయి..
శ్రద్ధన్నది మెఱుగైతే..చదువుకోగ బలమందును..!
ప్రాణం విలువను తెలిసే..సంగతేమి మాధవుడా..
స్నేహం నీ గొడుగైతే..పెంచుకోగ బలమందును..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు