భద్రాచల రామదాసు గా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న. 1620 లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించాడు[1]. వీరి భార్య కమలమ్మ శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసు గా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానమునకు, ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధము. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. దాశరథీ శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము - ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. ఇతని గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు. (కబీర్ దాసు గారు రామదాసునకు తారక మంత్రముపదేశించిరని కూడా ఒక కథ యున్నది). శ్రీ రాముని సేవలో, సంకీర్తనలో రామదాసు తమ శేషజీవితమును గడిపాడు. త్యాగరాజాదులకు అతను ఆద్యుడు, పూజ్యుడు. త్యాగరాజు కీర్తన - "ధీరుడౌ రామదాసుని బంధము దీర్చినది విన్నానురా రామా?" - ఇంకా ప్రహ్లాదవిజయములో "కలియుగమున వర భద్రాచలమున నెలకొన్న రామచంద్రుని పాదభక్తులకెల్ల వరుడనందగి వెలసిన శ్రీరామదాసు వినుతింతు మదిన్" - అన్నాడు .

దాశరథీ శతకము

శ్రీరాముని ప్రస్తుతిస్తూ కంచర్ల గోపన్న 17వ శతాబ్దంలో రచించిన భక్తి శతకము. ఈ శతకానికి దాశరథీ కరుణాపయోనిధీ అనే మకుటం అన్ని పద్యాలలో చివరగా వస్తుంది. దాశరథీ అనగా దశరథుని పుత్రుడైన శ్రీరాముడు. గోపన్న ఆత్రేయస గోత్రుడు . కాంమాంబ యాతని తల్లి, తండి... లింగన మంత్రి. ఈ విషయమును ఇతడు ఈ పద్యమున తెలెపెను.

 అల్లన లింగ మంత్రి సుతుడత్రిజగోత్రజడాదిశాఖ కం
 చెర్లకులోద్భవుండన బ్రసిద్దుడనై భవ దంకితంబుగా
 నెల్ల కవుల్ నుతింప రచియించితి గోపకవీంద్రుడన్ జగ
 ద్వల్లభ: నీకు దాసుడను దాశరథీ కరుణాపయోనిధీ.