గురజాడ రచనల్లో కన్యాశుల్కము (నాటకం) అగ్రగణ్యమైనది. కన్యాశుల్కము దురాచారాన్ని విమర్శిస్తూ గురజాడ రచించిన ఈ నాటకం భారతీయ భాషల్లో వెలువడిన అత్యుత్తమమైన రచనలలో ఒకటి. 1892లో ప్రచురించిన మొదటి కూర్పుకు ఎన్నో మార్పులు చేసి 1909లో రెండవ కూర్పును ప్రచురించాడు. వాడుక భాషలో, విజయనగర ప్రాంత యాసలో రాసిన ఈ నాటకం 100 సంవత్సరాల తరువాత కూడా ఈ నాటికీ పాఠకులను అలరిస్తూ ఉంది. ఈ నాటకం కన్నడం, ఫ్రెంచి, రష్యన్, ఇంగ్లీషు (2 సార్లు), తమిళం, హిందీ (2 సార్లు) భాషల్లోకి అనువాదమైంది.