368
మాటలేల సరిపోవును..నిను పొగడగ ప్రియ సఖుడా..!
కనులు అలసి పోవుకదా..నిను కొలవగ ప్రియ సఖుడా..!
మది నిండిన నీ రూపము..హత్తుకొనిన వేళ అహో..!
మైమరచిన వైనమదే..నిను తలచగ ప్రియ సఖుడా..!
పసిడి వెలుగు దివ్వెలెన్నొ..పలకరించు వేడుకలో..!
మిసిమి వయసు మురిసిపోయె..నిను వలచగ ప్రియ సఖుడా..!
ఏ రేయికి ఎంత దిగులొ..నీ విరహము ఓపలేక..!
ఒప్పుకోదు చెలియ మనసు..నిను విడువగ ప్రియ సఖుడా..!
ఏముందో నీ కన్నుల..ఆ వెన్నెల సోయగాల..!
నిజ మధురా పురమదిగో..నిను వేడగ..ప్రియ సఖుడా..!
ఈ రాధాకు బృందావని నీ సన్నిధె 'మాధవు'డా..!
కను సైగతొ లాలింతువు..నిను కోరగ..ప్రియ సఖుడా..!