372..
ఏ ఎండకు ఆ గొడుగును పట్టటమే..తెలియాలోయ్..!
ఎవ్వరినీ నొప్పించక నడవటమే..తెలియాలోయ్..!
ఏమున్నది మాటలలో.. సూటిపోటి తనమెందుకు..?!
ఎప్పుడైన ఆనందం..పంచటమే..తెలియాలోయ్..!
ప్రాణంలో ప్రాణంగా..ప్రతి ప్రాణిని భావించగ..
చూపులలో అమృత ప్రేమ కురియటమే..తెలియాలోయ్..!
కాలమేమి చేస్తుందట..గాయాలను మాన్పేందుకు..?!
చిరునవ్వుల జాబిలిలా వెలగటమే..తెలియాలోయ్..!
అపారమౌ వ్యాపారం..చెలిమి సాక్షి జరిగేందుకు..
తలపులలో నిజాయితీ..నిలపటమే..తెలియాలోయ్..!
మానవుడే.."మాధవు"డోయ్..పరిమళించు మనసుంటే..!
తన తనువును వేణువుగా..మలచటమే..తెలియాలోయ్..!