గజల్ 3698.
ప్రబోధాలతో ఇప్పుడు..ప్రయోజనం లేదంటా..!
చైతన్యం పొంగించే..విధానమే మేలంటా..!
మట్టితోటి మమేకమై..జీవించుట విజ్ఞతయే..
ప్రాణికోటితో స్నేహం..తెలియుటయే చదువంటా..!
ఎన్ని ఆటలాడినావొ..మనసుపడే ముచ్చటతో..
నీకునీవు సాక్షివైన..ఆనందం తోడంటా..!
ఆధిపత్య మధువుమరిగి..పేలుతున్న తీరేమిటొ..
ధనమదమే హెచ్చిందా..ఉండదులే దిక్కంటా..!
మెతుకందని బతుకులనే..కాచువారె నేతలు కద..
మానవతకు అద్దంలా..నిలచుటయే తగునంటా..!
సేవాంకిత మానవులే..ఆ మాధవ స్వరూపులోయ్..
దైవాలకు కృతజ్ఞతలు..అర్పించుట నయమంటా..!