గజల్ 3673.
ఎవరిమీద దేనికొరకు..జరపాలోయ్ దండయాత్ర..!
బుద్ధి కలిగి గుణములపై..చేయాలోయ్ దండయాత్ర..!
వేటాడే మనసుతోటి..వేదనేల తొలగేనట..
కరుణామృత మేఘంలా..సల్పాలోయ్ దండయాత్ర..!
విశ్వప్రేమ సౌందర్యపు..రుచి ఎప్పుడు అందేనో..
చిరునవ్వులె అస్త్రాలుగ..జరగాలోయ్ దండయాత్ర..!
సకలజీవ కోటిపట్ల..అనురాగమె రాగం కద..
దివ్యమైత్రి భావనతో..నిండాలోయ్ దండయాత్ర..!
కొమ్మమీది కోకిలమ్మ..ఆవేదన ఎవరికెరుక..
పచ్చదనం కాపాడగ..కావాలోయ్ దండయాత్ర..!
మరి మాధవ గజల్ గొంతు..పాడుతోంది శాంతిగీతి..
ప్రతి ఎదలో చెలిమిమీర..పొంగాలోయ్ దండయాత్ర..!