382..
మధువెందుకు..నీ చూపుల వెన్నెల'నే.. త్రాగు వేళ..!
తగవెందుకు..నీ రెప్పల కౌగిట'నే.. నలుగు వేళ..!
యుగాలుగా..హృదయ వీణ మీటుతున్న నెరజాణా..!
కలలెందుకు..నీ అడుగుల జాడల'నే..సాగు వేళ..!
అలల కాలి మువ్వలలో..స్వరములెన్ని నింపేవో..!
వ్యథలెందుకు..నీ పలుకుల మెరుపుల'నే కరుగు వేళ..!
అలిగిపోవు మేఘమాల..కన్నుల తడి తుడిచేవా..!
వగపెందుకు..నీ వలపుల వనముల'నే తిరుగు వేళ..!
కణ కణమున మౌన నిధికి..హంస గీతి..నీవేగా..!
చదువెందుకు..నీ నగవుల వెలుగుల'నే..ఎదుగు వేళ..!
'మాధవు'డా..నీ జతలో..పరవశించ వేడుకాయె..!
జగమెందుకు..నీ వేణు రవములలో..మునుగు వేళ..!