410..
ఎడబాటును వెన్నెలగా భావించుట.. మధురమౌను..!
ప్రతి బాధను రసధునిగా తలపోయుట.. మధురమౌను..!
తాను లేని వేళలన్ని అమృతభావ గీతికలే..!
అయ్యేందుకు..సాధనగా పడియుండుట..మధురమౌను..!
మధువేదో కావాలను ఆలోచన వీగిపోగ..!
అమవస నిశి..తారకగా మిగిలుండుట..మధురమౌను..!
మౌనాలను పాలించే శ్వాసమాటు చైతన్యమె..
కలల జలధి..వారధిగా తానుండుట..మధురమౌను..!
విరహాలను కాల్చలేని మైత్రి లేదు విశ్వమందు..
సరసాలకు..సంగతిగా..మనసుండుట మధురమౌను..!
తాపముతో యమునాతటి అభిసారిక రాధాయెను..!
'మాధవు'డా..వేణువుగా..నేనుండుట..మధురమౌను..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు