443..
అందమైన అక్షరాల - ఆకాశం నీ హృదయం..!
నిత్యనూత్నభావసుధా - మధుకలశం నీ హృదయం..!
నీవే నా తోడన్నది - వివరించగ కుదరదులే..!
దూకు స్నేహ కిరణాలకు - శుభ ద్వారం నీ హృదయం..!
మబ్బు నీడ మధురిమలో - తేలియాడు ప్రియతముడా..!
మెరుపువాన చరణాలకు - మధుపర్కం నీ హృదయం..!
కనుసైగన విశ్వాలను - నడిపించే మౌననిధీ..!
కొనియాడగ తరము కాని - అమృతవనం నీ హృదయం..!
కలము నిలచె విస్తుబోయి - నీ మంగళ హాసాలకు..!
కలల మేఘ రాగాలకు - ఒక అద్దం నీ హృదయం..!
నీదు గాన రవళులలో - పరవశింతు 'మాధవు'డా..!
తలపు వేణు నాదాలకు - నిజ మూలం నీ హృదయం..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు