447..
ఆకుపచ్చ బంగారం - తియతియ్యగ పలకరించె..!
కన్నెవయసు సింగారం - బహు చక్కగ పులకరించె..!
ప్రియని కొరకు ఎదురుచూపు మధురగాన మైన వేళ..
తోడుగున్నతోటేమో - పసిడి పూత సంతరించె..!
తన లోకమే తనది కాగ - పరవశించు వలపులతో..
మల్లె చెండు నవ్వులన్ని- వాలు జడన మేళవించె..!
ఎదను పొంగు మరుల సోన చూపులలో జాలువార..
నడకలోన వయ్యారం - మెలమెల్లగ రంగరించె..!
వెంటాడే చీకట్లను - వెలుగు నదిగ మార్చేందుకు..
మనసులోని ప్రేమంతా - తన నవ్వున చిలకరించె..!
'మాధవు'డా..! నీ దయతో - ఆ'రాధయె దిగి రాగా..
ప్రకృతితో సంభాషణ - ప్రణయసుధగ పరిణమించె..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు