487..
సుడిగాలికి పీట వేసి పాఠాలను చెప్పాలిక..!
పొడి మట్టిని బొమ్మచేసి ప్రాణాలను నింపాలిక..!
కంటి తడికి..గుండె లయకు ఉన్న శృతిని తెలుసుకోగ..
కత్తి దూయు శక్తులమది భావాలను కడగాలిక..!
రక్తపురుచి ఆశించే అజ్ఞానపు మనుషులెవరు..?!
ముచ్చటపడు మనసులోతు మోహాలను కాల్చాలిక..!
జరుగుతోంది ప్రతి కణమున కురుక్షేత్ర సంగ్రామం..!
మైత్రిసుధలు వర్షించగ హృదయాలను కదపాలిక..!
ఏ దేవుడు హర్షించును తన బిడ్డల యాతనలను..!?
విశ్వమందు రాజ్యమేలు రోగాలను మాన్పాలిక..!
ఎవరి బుద్ధి వారి దీపమౌను చూడ సాక్షివగుము..!
ఆ 'మాధవ' బృందావన రాగాలను పట్టాలిక..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు