518..
నిదురపోని ఏరులాగ దూకుతోంది..నీ నవ్వు..!
ఎదకందని మధువులాగ ఊరుతోంది..నీ నవ్వు..!
చినుకుగుండె సవ్వడులకు ప్రాణమేల పోసేవో..!?
ప్రతి వధువుకు సిగ్గులాగ..కూడుతోంది..నీ నవ్వు..!
చిరుగాలుల కెరటాలకు ఊసులేల నేర్పుతావొ..?!
చంద్రశిలకు ఒంపులాగ..నిండుతోంది..నీ నవ్వు..!
ఎడారిలో వసంతాల సందడులే చేతువుగా..!
విరహాలకు విడుపులాగ..చేరుతోంది..నీ నవ్వు..!
ప్రేమగగన సీమలకే అద్దమంటి సొగసు నీది..!
ప్రణయాలకు పాన్పులాగ..వాలుతోంది..నీ నవ్వు..!
ఆ'రాధా 'మాధవ' బృందావన వీధులలో..
నాట్యాలకు మెరుపులాగ. ఒదుగుతోంది..నీ నవ్వు..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు