560..
మౌనముగా శాసించే..శ్వాసధార మధురమోయి..!
అక్షరాల వర్షించే..అమృతధార మధురమోయి..!
ప్రతి పుట్టను..ప్రతి చెట్టును.. ఏ కన్నుల చూడాలో..
పలుకకనే వివరించే.. స్నేహధార మధురమోయి..!
సిరిమువ్వల సవ్వడులకు.. అందకనే చిత్రముగా..
హృదయలయల నినదించే.. ప్రణవధార మధురమోయి..!
ఇంద్రధనువు వర్ణాలకు కాన్వాసుగ అయ్యేందుకు..
అంకితమై స్పందించే రాగధార మధురమోయి..!
వేకువనే నిదురలేచు రైతన్నల ఊపిరులకు..
క్రొత్తశక్తి అందించే ప్రేమధార మధురమోయి..!
సమయానికి ఎదను చేరి.. మురిపింతువు 'మాధవుడా..!'
తలచినంత అలరించే..తత్వధార మధురమోయి..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు