588.
చీకట్లను ముద్దాడే..సూర్యునిలా బ్రతకాలిర..!
కణ కణమున కదలాడే..భానునిలా బ్రతకాలిర..!
మంచుపూల దుప్పట్లను..కరిగించే పనితనమా..!
ఆ నేర్పును అందించే..ఆద్యునిలా బ్రతకాలిర..!
కొండకోన..చెట్టుచేమ..ఓషధులను పెంచేందుకు..
ప్రకృతినే అర్చించే..ప్రథమునిలా బ్రతకాలిర..!
అమృతత్వపు కోవెలగా..ప్రతి బిందువు అలరారగ..
మేఘాలను సృష్టించే..కిరణునిలా బ్రతకాలిర..!
అంతరంగ జగతిలోని..ఆ వసంత సీమలేల..
అక్షరాల పలికించే..అర్కునిలా బ్రతకాలిర..!
మానవుడే 'మాధవు'డౌ..సంక్రాంతుల సంబరమే..
ఈ భువిలో పండించే..ఈశునిలా బ్రతకాలిర..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు