***600..
ఆరు రుతువులద్భుతముగ..పలకరించు వీణలాయె..!!
ఆ తారల సొగసులన్ని..నిలువరించు వీణలాయె..!!
ప్రకృతి కళల శోభలన్ని..చెలి అడుగుల ననుసరింప..
గాలిలోని ఊసులన్ని..పరవశించువీణలాయె..!!
మూగవలపు మధుధారల..గీతాలను వర్షించగ..
పూలనేలు శ్వాసలన్ని..పులకరించు వీణలాయె..!!
యుగాలెన్ని గడచిపోని..జగము మరచు వేడుకలో..
జన్మబంధ కాంక్షలన్ని..కలవరించు వీణలాయె..!!
పాడిపంట వెల్లివిరియు..దారిలోన వెలుగువాన..!
చిరునవ్వుల వెన్నెలగని..రంగరించు వీణలాయె..!!
'మాధవు'నకు సప్తపదుల..ఆటలతో పనియేమి..?!
ఆ'రాధా' సిగ్గులన్ని..మోహరించు వీణలాయె..!!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు