605..
తన చూపుల దారాలతొ..వెన్నెలవల.. విసిరింది..!!
తన నవ్వుల పువ్వులతో..కమ్మని కల.. విసిరింది..!!
ఎంత మధుర భావనమో..ఎదజలధిని ఉప్పొంగగ..
సంగతిగా తన సొగసుల..నిజ గలగల.. విసిరింది..!!
మౌనాలను పండించే..మంగళకర పరిమళమై. .
తన పదముల సందడిలో కలహంసల.. విసిరింది..!!
జగములనే పాలించే..పసిడి మేఘమాల తాను..!
కాంతి పారిజాతమ్ముల..నెలవంకల.. విసిరింది..!!
చిత్తరువుల అత్యద్భుత..నాట్యమ్ముల నిధి తానై..
జగన్నాటక వేదికపై..దృశ్య కథల.. విసిరింది..!!
కర్మ సాక్షి కిరణాలకు..సాక్షియైన కొమలిరో..!
ఆ'మాధవ' భామినియై..సరస సుధల విసిరింది..!!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు