4627..గజల్.
ఉన్నది గాలికి..ఆరని దీపం..!
శ్వాసల సాక్షిగ..వెచ్చని దీపం..!
దీపావళియే..నిత్యం లోపల..
కన్నుల చూడగ..చిక్కని దీపం..!
గగనా లెన్నో..దాటించునులే..
మాటల కందని..తియ్యని దీపం..!
మోమున విరిసే..నవ్వుల విల్లే..
దాచాలన్నా..దాగని దీపం..!
ఉత్సాహానికి..ఊపిరి మూలం..
ప్రేమోత్సవాన..చక్కని దీపం..!
తలపుల పంటకు..బలమును నింపును..
మౌనపు కోవెల..వీడని దీపం..!
శాంతం స్వర్గం..చూపే తల్లిరొ..
జగముల నేలే..పచ్చని దీపం..!
మాయా మోహం..వదిలించునులే..
చెలిమిని పెంచే..చల్లని దీపం..!
జీవాధారం..మాధవ తత్వం..
కులమో మతమో..అంటని దీపం..!