గురజాడ రచనల్లో కన్యాశుల్కము (నాటకం) అగ్రగణ్యమైనది. కన్యాశుల్కము దురాచారాన్ని విమర్శిస్తూ గురజాడ రచించిన ఈ నాటకం భారతీయ భాషల్లో వెలువడిన అత్యుత్తమమైన రచనలలో ఒకటి. 1892లో ప్రచురించిన మొదటి కూర్పుకు ఎన్నో మార్పులు చేసి 1909లో రెండవ కూర్పును ప్రచురించాడు. వాడుక భాషలో, విజయనగర ప్రాంత యాసలో రాసిన ఈ నాటకం 100 సంవత్సరాల తరువాత కూడా ఈ నాటికీ పాఠకులను అలరిస్తూ ఉంది. ఈ నాటకం కన్నడం, ఫ్రెంచి, రష్యన్‌, ఇంగ్లీషు (2 సార్లు), తమిళం, హిందీ (2 సార్లు) భాషల్లోకి అనువాదమైంది.

గురజాడ మరణం తరువాత కన్యాశుల్కము పై ఎన్నో వివాదాలు రేగాయి. అది అసలు అతను రాయనేలేదనీ, వేరెవరో రాస్తే, తన పేరు వేసుకున్నారని ఒకటి; అతను ఇంగ్లీషులో రాస్తే, వేరే ఒకాయన దానిని తెలుగు లోకి అనువదించారని మరొకటి, ఇలాగ కొన్ని వివాదాలు రేగాయి. చివరికి ఆ వాదనలన్నీ అసత్యాలని తేలిపోయాయి. ఈ వివాదాలన్నీ గురజాడ మరణం తరువాత వచ్చినవే. ఇన్ని వివాదాల మధ్యా కన్యాశుల్కము కొన్ని వందల ప్రదర్శనలు పూర్తి చేసుకుంది. 100 ప్రదర్శనలు పూర్తి చేసుకున్న మొదటి తెలుగు సాంఘిక నాటకమదే!

పుత్తడి బొమ్మా పూర్ణమ్మా అనే సుప్రసిద్ధ గేయం అతను రచనల్లో మరొకటి. దీని ఇతివృత్తం కూడా కన్యాశుల్కము దురాచారమే. కరుణ రసాత్మకమైన ఈ గేయ కావ్యంలోని చివరి పద్యం ఇది:

కన్నుల కాంతులు కలువల చేరెను
మేలిమి జేరెను మేని పసల్‌
హంసల జేరెను నడకల బెడగులు
దుర్గను జేరెను పూర్ణమ్మ
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా