4602..గజల్.
నవ్వి చిచ్చు రేపినావు..న్యాయమేమి ఇంతకన్న..!
ప్రేమలేఖ చింపినావు..ధర్మమేమి ఇంతకన్న..!
వేచి ఉండమన్న చోటికొచ్చి నిలిచానే చెలీ..
మాట ఇచ్చి తప్పినావు..భాగ్యమేమి ఇంతకన్న..!
నమ్మి మోసపోయానని బాధపడే పనేంలేదు..
కురులగాలి విసిరినావు..సౌఖ్యమేమి ఇంతకన్న..!
జాలిచూప వేడలేను..పరమకరుణ నిధివినీవు..
మధుశాలన నిలిపినావు..స్వర్గమేమి ఇంతకన్న..!
బడి ఏదో గుడి ఏదో..నీ పేరే జపమైనది..
మంత్రమేదొ వేసినావు..నరకమేమి ఇంతకన్న..!
ఎంతప్రేమ నేనంటే..కలనైనా కనిపించవు..
మరపు తలుపు మూసినావు..సత్యమేమి ఇంతకన్న..!
యుగాలెంత రెప్పపాటుముందు చూడ మాధవుడా..
చెలిమివిలువ తెల్పినావు..మర్మమేమి ఇంతకన్న..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు