4592..గజల్.
నా శ్వాసను స్వరధారగ..మలచినావు మలచకనే..!
నీ పాటను వేలికొసల..ఒంపినావు ఒంపకనే..!
మాటలేల చెప్పగలను..నీ రచనా చమత్కృతికి..
మనిషిజన్మ బహుమతిగా..ఇచ్చినావు ఇవ్వకనే..!
నీ మాయా నాటకమున..చిన్ని గరికపాటి కానె..
ప్రియమారగ లోకహితగ..నిలిపినావు నిలుపకనే..!
నీ తలపే అసలుచెలిమి..పూలతోట ఈ మనసున..
పలుచింతల మూటపట్టి..కాల్చినావు కాల్చకనే..!
వరమేదో శాపమేదొ..చూసే కోణంలోనేగా..
దృష్టిమాటు దోషాలను..కడిగినావు కడుగకనే..!
ప్రతిఫలమే ఆశించని..తత్వమెలా అబ్బేనో..
అమృతమౌన సంద్రంలో..ముంచినావు ముంచకనే..!
మాధవుడా నీ గజళ్ళ..పాలపుంత మనోహరం..
వెలుగుతేనె ఊట లోన..ఉంచినావు ఉంచకనే..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు