4562..గజల్.
గుండెకైన గాయంకథ..చెప్పాలని లేదు..!
ఒక అశ్రువు మాటు ఘోష..పాడాలని లేదు..!
ప్రేమకన్న వేదించే..సంగతేమి టసలు..
ఈ విరహపు కడలినింక..మోయాలని లేదు..!
వెన్నెలింటి మంచువాన..అగ్గిలాగ మారె..
బరువెక్కిన ఈ శ్వాసను..నిలపాలని లేదు..!
కఠినశిలయు కరుగునేమొ..నీ మనసది ఏమి..
అయోమయమెంత హాయో..ఓపాలని లేదు..!
వ్రాయరాని కావ్యమనగ..మనతియ్యని చెలిమి..
అక్షరాల పంజరమున..ఉంచాలని లేదు..!
నీ కోసం కలవరించు..పూలతోట మనసు..
నీవురాక చిగురైనా..తొడగాలని లేదు..!
మరిమాధవ గజల్ కన్న..కల్పతరువు ఏదొ..
ఇహపరాల గుట్టునింక..విప్పాలని లేదు..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు