233..అనంత జ్ఞాన వరదాయిని గోదావరీ పుష్కర గంగమ్మకు___/||\___ నమో నమః ..
పావనా గోదారి.. పాశమ్ము మాన్పేను..!!
పుష్కరా(ళా) గోదారి..పాపమ్ము కడిగేను..!!
గోదారి గంగమ్మ భాగ్యాల రాశిరో..
'నాసిక్' న గోదారి..నాదమ్ము విరిసేను..!!
సీతమ్మ,రామయ్య అడవిలో ఉన్ననూ..
భధ్రాద్రి గోదారి..భధ్రమ్ము చూసేను..!!
ప్రాంతాలు ఏవైన..చూపదే తేడాలు..
అమ్మలా గోదారి..దాహమ్ము తీర్చేను..!!
నన్నయ్య కలములో భారతము వెలయంగ..
మన రాజమండ్రిలో..వేదమ్ము మ్రోగేను..!!
అంతరంగములోని..హాయి నది ఉప్పొంగ..
ప్రతి ఎదకు గోదారి..క్షీరమ్ము నింపేను..!!
యేరులై పారుతూ చేనులే తడుపుతూ..
వాగుల్లో గోదారి..వాదమ్ము నిలిపేను..!!
తపములే చేయంగ మహరుషుల స్థానమై..
బాసరలొ గోదారి..జ్ఞానమ్ము పంచేను..!!
క్షేత్రాలు.. తీర్థాలు..చైతన్య దీపికలు..
మహిమగల గోదారి..ధర్మమ్ము కాచేను..!!
తరులతల ఓషధులు పోషించు దేవతై..
మంగళా గోదారి..మోదమ్ము కూర్చేను..!!
ప్రేయసీ ప్రియుల.. ఎదలలరించు జాణయై..
విరిబాల గోదారి..విరహమ్ము త్రుంచేను..!!
మైత్రి వరదాయినై..లోకాలు త్రిప్పుచూ..
నక్షత్ర గోదారి..మోక్షమ్మునిచ్చేను ..!!
ఆనంద సందోహ డోలికల తేలించు..
సత్కళా గోదారి..సత్యమ్ము తెలిపేను..!!
కణకణము శక్తినిధి కలలందు ఒలికింప..
చిత్కళా గోదారి..చిత్రమ్ము చేసేను..!!
కావ్యేతిహాసాల కథనాలు వినిపింప..
గలగలా గోదారి..హాసమ్ము చిందేను..!!
ఏచోట మునిగినా తేలుటే తెలియాలి..
శ్వాసలో గోదారి.. మౌనమ్ము సాగేను..!!
పుష్కరాలకు జనులు భక్తితో వస్తేను..
దైవమై గోదారి..ధ్యానమ్ము నేర్పేను..!!
ఎవరెంత పలికినా తరగనిది ఆ ధార..
'మాధవు'ని గోదారి..గానమ్ము వెలిగేను..!!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు