శీర్షిక: పలకరింపు
పలకరింపులోని మాధుర్యం
ఎండలో వెన్నెల కురిసినట్లు కాకపోయినా
ఎడారిలో ఒయాసిస్లా సేద తీర్చకపోయినా
మనసుకు హాయినిస్తే చాలు
గుండె ధైర్యాన్ని ఇచ్చే మాట నీదవ్వాలి!
తేనె పూసుకున్న కత్తిలా
మోచేతికి తగిలిన దెబ్బలా
మాటలోని మర్మం గుండెను గాయం చేస్తుంటే
అర్థం కాని వ్యంగ్యమైనా అభిమానం
వెంటపడి జోరీగలా తరుముతుంటే...
మాటలే తూటాలై బాధిస్తుంటాయి!
ఒక పలకరింపు ఒక పరామర్శ
తెలియని ధైర్యాన్ని నింపే ఔషధాలు కావాలి
నీకోసం ఒక మనసు స్మరిస్తున్నదని
నీ యోగక్షేమాలను తలుస్తున్నదని... అనే
భావనే వెయ్యి ఏనుగుల బలాన్ని నింపాలి!
సాయం చేయకపోయినా పర్లేదు
సాయం పేరిట శవపరీక్ష చేయకు
ఓదార్పుయాత్ర మాటున ఊపిరి తీసే మాటలు వద్దు
వాన కాలం తర్వాత ఎండాకాలం వచ్చినట్టు
ఓడలు బళ్ళు బళ్ళు ఓడలవుతాయి
ఓదార్పు పర్వంలో ఒరిగిపోయే తంతు నీదవుతుంది!!
-జ్యోతి మువ్వల
బెంగళూరు.
సామాజికం,