శీర్షిక: తొలి చూపు
తొలిపొద్దు మంచుదుప్పటిలో
విరిసిన మందారంలా
వేకువ కిరణం తగిలిన
మంచు బిందువై మెరిసింది!
చూపులతో గాళం వేసింది
మనసుకు మబ్బును చుట్టి
తన చీర కొంగుకి ముడి వేసింది !
గుండెలయ అదుపు తప్పి వేగం పెరిగింది
దాగుడుమూతలతో ఆమె చుట్టూ
ప్రదక్షిణ చేస్తుంది!
ఆమె చూపుల వర్షంలో
దేహం తడిసి ముద్దైంది!
వసంతాలను కుమ్మరించే చెట్టై
పువ్వుల నవ్వులను కురిపించింది!
తనను చూసే ప్రతిరోజు
తొలిచూపుగా నన్ను కవ్విస్తున్నది
చూపులలోని సరసం
రెండు తీరాల మధ్య నదీ ప్రవాహమై
ఎదలోని మాట మది గడప దాటక
మౌన మునిలా తన పేరే ధ్యానిస్తున్నది!
తన ఊహలతోనే మది పరవశిస్తూ
ప్రతి వేకువ నా కనుల కలలకు తన తలపే
వలపుల శృంగారంమైంది!!
జ్యోతి మువ్వల
6/10/21