348..
మల్లె కన్న మెత్తనైన.. నీ నవ్వుల వాన చాలు..!
మంచు కన్న చల్లనైన.. నీ చూపుల వాన చాలు..!
గులాబీల పరిమళాల.. ప్రాణాలకు ప్రాణమీవు..!
వర్ణాలకు అతీతమౌ.. నీ సొగసుల వాన చాలు..!
నిన్ను చూచు కన్నులకే.. సొంతమయే కాంతి లతా..!
నిత్య సత్య వేదమైన.. నీ పలుకుల వాన చాలు..!
వన వనమున వసంతాలు.. కురిపించే కోకిలమా..!
అనురాగపు వెన్నెలైన.. నీ స్వరముల వాన చాలు..!
కలవరించు కలహంసల మదినేలే..కమలాలయ..!
గుండె లయల మౌనమైన.. నీ మధువుల వాన చాలు..!
ఆ'మాధవ' కనుపాపల.. నాట్యమాడు ఓ రాధా..!
నన్నేలగా వేడుకైన..నీ వెలుగుల వాన చాలు..!