354
మూసి ఉన్న కన్నులలో.. నిండినావు పండుగలా..!
లేత లేత వలపులలో..నిలచినావు పండుగలా..!
మాటలసలు రాకున్నవి.. నీ రూపమె చూస్తుంటే..!
తెలుప రాని తలపులలో..ఒదిగినావు పండుగలా..!
కుదరదులే చూపేందుకు..వేరొకరికి..నీ ప్రేమను..!
మూగ గుండె పెదవులలో..దాగినావు పండుగలా..!
తెలియదుగా..నా మనసుకు నిదురన్నది క్షణమైనా..!
నా తనువున కణములలో..విరిసినావు పండుగలా..!
విరహానికి తావు లేని..నీ చెలిమికి తనువులేల..!?
మదినేలే మెరుపులలో..చేరినావు పండుగలా..!
'మాధవు'డా..ఈ రాధా శ్వాస సాక్షి నీవేగా..!
స్నేహ వేణు రవములలో..కూడినావు పండుగలా..!