373..
తృప్తి యొక్క చిరునామా..అందించెను నీ హాసం..!
ప్రేమ నిధికి దారేదో..చూపించెను నీ హాసం..!
మెరుపు మదిని వీణియగా మలచు చెలియ నీవేగా..!
కోర్కె పట్ల అవగాహన..కలిగించెను నీ హాసం..!
చినుకు తల్లి గుండె లయల..స్వరములలొ ఏముందో..!?
మౌన సుధల రుచిరములను..వివరించెను నీ హాసం..!
స్వప్న జలధి చిత్రాలను..అనువాదం చేసేవా..!?
దేహ మోహ సంవాదం..తొలగించెను నీ హాసం..!
మధురమైన బాధ లోతు..అంతేదో చూపినావు..!
ఆనందపు దీపాలను..వెలిగించెను నీ హాసం..!
నా యమునా తటి తాకే..అలల మదికి శాంతినిడగ..
ఆ'మాధవ తత్వమునే..వినిపించెను నీ హాసం..!