గజల్ 3648.
స్వచ్ఛమైన మల్లియలా..బ్రతుకుటయే మంచిదింక..!
మధ్యదూరం తనువులకే..ఉంచుటయే మంచిదింక..!
'కరోనా'యె 'కోవిద'లే..భయభ్రాంతులు తొలగజేయు..
మన గొప్పలు కట్టిపెట్టి..ఉండుటయే మంచిదింక..!
ధైర్యమొకటి చాలదిపుడు..జాగ్రత్త దివ్యౌషధం..
అనవసరపు కాలిదురద..నిలుపుటయే మంచిదింక!
తేలికైన ఆహారమె..కాచునుగా ఆరోగ్యము..
పాఠమెవరు చెప్పాలట..తెలియుటయే మంచిదింక..!
స్వయంకృతాప రాధమే..జాతివినాశ హేతువే..
కక్ష సాధింపులకు తెర..దించుటయే మంచిదింక..!
నీ బుద్ధిని మించి లేడు..మానవుడా మాధవుడే..
కరుణకదా దైవత్వం..చూపుటయే మంచిదింక..!