గజల్.. 3645.
విశ్వానికి తో 'రణమై..చేరినావు చాలును పో..!
మనిషి అహముపైన దెబ్బ..కొట్టినావు చాలును పో..!
చేతులెత్తి మ్రొక్కేమో..యమలీలా వినోదినీ..
బ్రతుకుతీపి సరిగ తెలియ..జేసినావు చాలును పో..!
నీ మాయా ప్రతాపాన..దశదిశలూ దద్దరిల్లె..
మేధస్సును దడదడలా..డించినావు చాలును పో..!
కాల జ్ఞానమున అపుడే..చెప్పినారు విన్నామా..
విర్రవీగు జాతిగుండె..కుదిపినావు చాలును పో..!
తినితాగే ముచ్చటలను..ఎండగట్టు విధమిదేన..
చంపుకు తిను విధికి చెక్కు..పెట్టినావు చాలును పో..!
యంత్రాంగము మంత్రాంగములన్ని చిత్తూ బలాదూర్..
ఆహ ఎంత వీరంగము..వేసినావు చాలును పో..!
మాధవుడే మౌనములో..మునిగినాడు ఎఱుకతోడ..
చరితలోకి శాశ్వతముగ..ఎక్కినావు చాలును పో..!