440..
మనసు కన్న పరుగు తీయు - హయము లేదు లోకంలో..!
తలపు కన్న చక్కనైన - మధువు లేదు లోకంలో..!
గురువు కొరకు వెదుకులాట - సహజములే మనుష్యులకు..
శ్వాసలోతు అందువరకు - సుఖము లేదు లోకంలో..!
భయం నిన్ను ఆవరిస్తె - బహుమానం మరణమేను..!
సాహసమే సాక్షియైన - తిరుగు లేదు లోకంలో..!
ఎంత పెద్ద గగనమైన - ప్రేమహృదికి సాటి రాదు..!
స్నేహం నీ ఊపిరైతె - బరువు లేదు లోకంలో..!
తేనె ఎంత మధురమో - బండ రాయి నడిగి చూడు..!
నవ్వు పూల సొగసు తెలియ - ముల్లు లేదు లోకంలో..!
కరుణ కురియు విరహజ్వాల - 'మాధవు'నకు వసంతమే..!
బృందావని హాసాలకు - కరువు లేదు లోకంలో..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు