472..
నీ నవ్వుల మెరుపు లతల ~ గానమౌను నా కవనం..!
నీ పలుకుల తలపు సుధల ~ మౌనమౌను నా కవనం..!
కావ్యముగా కోట్ల పుటల ~ వ్రాసేందుకు ఉన్నదేమి..?!
శూన్య గగన సోయగాల ~ శిల్పమౌను నా కవనం..!
నన్ను నేను లోలోపల ~ దిద్దుకునే ముచ్చటలో..
ప్రవహించే పరవశాల ~ తల్పమౌను నా కవనం..!
రాగాలకు బందీనై ~ బ్రతుకుతున్న చెరసాలన..
కలహించే జ్ఞాపకాల నాట్యమౌను నా కవనం..!
ఎగిరిపడే దిష్టిబొమ్మ ~ ఏనాటిదొ ఎరుక లేక..
జీవించే దీపశిఖల ~ రాజ్యమౌను నా కవనం..!
'మాధవు'డై..నడయాడగ ~ వేడుకైన సందడిలో..
శ్వాసించే అక్షరాల ~ పద్యమౌను నా కవనం..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు