503..
దారేదీ..నీ మనసును ~ గెలుచుకొనగ తెలుపుమింక..!
నీ అడుగుల జాడలలో ~ నడచుకొనగ తెలుపుమింక..!
ఏ నీడను చూసినా ~ నీ వెలుగుల ముద్రలహో..!
నీ పలుకుల ముత్యాలను ~ ఏరుకొనగ తెలుపుమింక..!
అందాలకు అందమైన ~ నీ సన్నిధి ఎంత హాయి..!
మధురమైన కావ్యాలను ~ అల్లుకొనగ తెలుపుమింక..!
సత్యమెంత మౌనసుధయొ ~ వివరించే కలహంసా..!
ఆ సుస్వర గగనాలను ~ హత్తుకొనగ తెలుపుమింక..!
ప్రేమ మేఘ మాలలలో ~ విహరించే లాస్యలతా..!
పసిడి వాన రాగాలను ~ అందుకొనగ తెలుపుమింక..!
యమునాతటి సీమలోన ~ ఏముందోయ్ 'మాధవుడా'..!?
నిత్య మందహాసాలను ~ పంచుకొనగ తెలుపుమింక..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు