@31-12-2015.ముషాయిరా గజల్..3. // 558..//
మదిలోపలి తననవ్వుకు వలే లేదు ఎందుకనో..!
చెలిప్రేమను తెలిపేందుకు నదే లేదు ఎందుకనో..!
నిన్ను చూచు వేడుకలో..మరచినాను నన్ను నేను..
కన్ను కన్ను కలయికలో కలే లేదు ఎందుకనో..!
నవ్వించే పూలచెండు..నా ఎదురుగ నిలచున్నా..
ఎదలోయల తోటలోన సడే లేదు ఎందుకనో..!
కాలకన్య పెదవులపై ఎన్ని మౌన రాగాలో..
ఆ స్వరములు సవరించగ పనే లేదు ఎందుకనో..!
సెలయేరుల జలకమాడు కాంతిపూల తరువులలో..
ప్రవహించే సరిగమలకు వెలే లేదు ఎందుకనో..!
కలహంసల సంభాషణ శ్వాసలలో పొంగువేళ..
ఉప్పొంగే భావసిరికి దరే లేదు ఎందుకనో..!
ఆ'మాధవ' యమునాతటి..వేచియున్న రాధ కథా..
వివరించగ ఏ భాషకు పసే లేదు ఎందుకనో..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు