// 574 //
వెండి వెలుగు రెక్కలతో.. ఎగిరేందుకు వగపెందుకు..!?
ప్రేమ పూల వనములోన..నిలిచేందుకు వగపెందుకు..!?
వేగలేని విరహాలను.. ఓర్చుకొనుట కష్టమేను..!
వేగవంతమైన మదిని..నిలిపేందుకు వగపెందుకు..!?
వచ్చిపోవు వసంతాలు..జీవితంపు బంధువులే..!
లేలెమ్మని నీకు నీవు..చెప్పేందుకు వగపెందుకు..!?
బేలతనపు వాకిలిలో..వాలటమది సబబు కాదు..!
సవాలుగా నీ శక్తిని..విసిరేందుకు వగపెందుకు..!?
కలహంసల నిట్టూర్పులు కాల్చివేయు జాణ నీవు..!
సరాగాల హృదయవీణ..మీటేందుకు వగపెందుకు..!?
'మాధవు'నకు కానుకగా..ఇచ్చేందుకు ఏమున్నది..!?
ప్రణయవేణు రవములలో..కరిగేందుకు వగపెందుకు..!?
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు