4597..గజల్.
ఎపుడు నిన్ను చూశానో..గుర్తులేదు అసలు..!
అప్పటి నుండి మనసుపై..పట్టులేదు అసలు..!
అంతరాలు అంతస్తుల..గొడవ ఆపుటెలా..
ఈ మతాలు కులాలకే..సిగ్గులేదు అసలు..!
ఇష్టాలను చంపుకునే..విద్య నేర్చుకొందు..
ప్రేమలోన పడుటవలన..సుఖములేదు అసలు..!
కన్నీటిని దిగమింగుతు..ఉండవద్దు మనము..
మౌనానికి సాటివచ్చు..మధువులేదు అసలు..!
సమాజాన్ని వెలివేసే..దివ్యశక్తి ప్రేమ..
మనసులు బలిపశువులైన..తిరుగులేదు అసలు..!
మనచెలిమిని గాలికూడ..వేరుచేయ లేదు..
నా శ్వాసల శ్వాసనీవు..అడ్డులేదు అసలు..!
ఓ మాధవ నీ గజలే..చెలియవలపు పాట..
నీ పూజకు భక్తిగాక..సుమములేదు అసలు..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు