శీర్షిక : జర భద్రం బిడ్డా
అప్పుడే వర్షం అప్పుడే ఎండా
క్లారిటీ లేని కాలానికి
ఏ ఋతువును నిందించాలి!
అవే కళ్ళు అదే మనుషులు
అంతలోనే రంగులు మార్చే నైజాన్ని
ఏ ఊసరవెల్లితో సరిపోల్చాలి!
కాలాన్ని మార్చిన మనుషులో...
కాలానుగుణంగా మారుతున్న మనుషులో
చెప్పలేని స్థితి!
అవసరం నేర్పిన వైఖిరో
అత్యాశతో నేర్చిన వేషమో గాని
ఆస్కార్కు తగ్గని నట విన్యాస ప్రదర్శనది!
నిజానికి నీడలాగ సాగే అబద్ధపు సౌదాలకు
నిజమే ఉలిక్కిపడి
అగ్నిపరీక్ష చేసుకునే అయోమయ దుస్థితి!
మనస్సాక్షిని మోసం చేసే మాటల గారడీతో
మయసభలాంటి మాయా లోకంలోకి లాగేసి
నీ చేతితో నీ కన్నె పొడిపిస్తారు!
నొప్పి తెలియకుండా ఆయింట్మెంట్ మాటలతో
పూత పూస్తారు
నిజానికి అబద్దానికి మధ్య ఉన్న సరళ గీత మీద నిన్ను
ఆడిస్తారు!
ఆదమరిచి అమాయకంగా నమ్మితే
దగా చేసి నట్టేట్లో ముంచుతారు!!
జ్యోతి మువ్వల
బెంగళూరు