శీర్షిక : ఆత్మఘోష
చుట్టూ చీకటి కమ్ముకున్న
ఆ గదిలో ఒక మూల
జ్యోతి ప్రజ్వలిస్తుంది
కనబడని ములుగు ఒకటి వినిపిస్తుంది!
రక్త సంబంధీకులు,
స్నేహితులు, ఆప్తులు
బోరున విలపిస్తున్న శబ్దం విని
దేహం విడిచిన ఆత్మ
భారంతో రోధిస్తున్నది!
ఓదార్చే ధైర్యం లేక
తనివితీరా వీడ్కోలు చెప్పే వీలు లేక
తను తిరిగిన నటిల్లు
శోకసంద్రంలో మునగటం చూడలేక
ఆ మూల నక్కినక్కి ఏడుస్తుంది!
నవ్వుతూ ఆహ్వానించే వీధి గుమ్మం
వెక్కి వెక్కి ఏడుస్తుంది!
ఇంటిలో ప్రతి వస్తువు జాలి చూపులతో
ఈ రుణానుబంధం ఇంతే అంటూ
సాగనంపు తున్నాయి...
వచ్చిన క్షణం గుర్తు లేక పోయే క్షణం తెలియక
అంతా అయోమయంలో నడిచిన బాట
చుక్కల్లో చేరుతున్న తరుణంలో
మాయని వీడిన దేహానికి
వాస్తవాన్ని చూస్తున్న జీవానికి మధ్య
సందిగ్ధమైన ఆట!
విధి ఆటలో ముగిసిన పాత్ర
మళ్లీ మళ్లీ దొరకని వేషధారణ కదా
అందుకేనేమో అంతటి బాధ !
నేను నాది అనుకుని నడిచిన ప్రతి క్షణం
జ్ఞాపకాలే తప్ప వాస్తవాలు కాదన్న నిజం తెలిసాక
భవబంధాలను వీడలేక
భారాలను విడువలేక
గాలిలో దీపమై సాగలేక
ఒక మూల నక్కి ఘెషిస్తున్నది!!
-జ్యోతి మువ్వల
30/10/21