జీవితం ఒక నావ ప్రయాణం
గమ్యం చేరే దారిలో
అలలు, సుడిగుండాలు
అవాంతరాలై ఎదురు పడవచ్చు
సునామియే వచ్చి ముంచేయవచ్చు...
అలా అని భయపడి ప్రయాణం ఆపేస్తామా?
మనసే నీకు మార్గం చూపు దీపం
భయమనే ఈదురుగాలి
జ్ఞానమనే దీపాన్ని అర్పేస్తుంది!
అగమ్య గోచరమైన ప్రయాణంలో
అంధకారాన్ని నిర్మిస్తుంది!
ఒక్క క్షణం ఆలోచించు...
దారి లేదని మరణమే సరి అని
నిశ్చేష్టుడవ్వకు!
ఈదురుగాలిని తట్టుకొని
దీపాన్ని కొండెక్కనివ్వక
ధైర్యాన్ని సొమ్మసిల్లనవ్వక
బ్రతకాలనే ఆశ బలపడితే...
ఆత్మ జ్యోతి అండగా నిలిచి దారి చూపుతుంది!
నిరాశను నింపుకుని
ఆత్మార్పణ చేసుకోవడం పాపం
జీవితం ఒక పోరాటం
గెలిచి చూపించాలే తప్ప
మధ్యలో రాజీనామా ఇచ్చి
నమ్ముకున్న వారిని నట్టేట ముంచకూడదు!!
-జ్యోతి మువ్వల
బెంగళూరు