315..
ప్రతి ఉదయం ఒక అరుణ రాగ మందారం..!
ప్రతి హృదయం ఒక మధుర రాగ మందారం..!
క్రొత్త ఆశ చిగురు వేస్తు..అడుగు వేయ తోడు నిలచు..
ప్రతి క్షణమూ ఒక అమృత రాగ మందారం..!
కాలమెంత అపురూపం..వర్ణించగ ఎవరి తరం..!?
ప్రతి ఘడియా..ఒక స్వర్ణ రాగ మందారం..!
యవ్వనాల వన సీమన నవ్వుతుంది వేదంలా..!
ప్రతి బిందువు ఒక స్వప్న రాగ మందారం..!
తన వెలుగులు సోకకుండ..తేనే పంట పండేనా..!?
ప్రతి పూవూ ఒక కిరణ రాగ మందారం..!
రాధాప్రియ 'మాధవు'డా..! నీ మహిమను తెలుపుటెలా..!?
ప్రతి కణమూ ఒక విశ్వ రాగ మందారం..!