Profile picture for user nallanvnc9
డా. ఎన్.వి.ఎన్.చారి
విద్యారణ్యపురి హన్మకొండ
9866610419

వేంకటేశ్వరా సామాజిక  పద్య శతకం 

శ్రీసఖి సేవనామృత విశేష  విలాస ఫలోప భోగమున్
చేతన నింపుచున్ జగతిసేద్యము జేసెడు ధర్మపాలకా
నీ సుతులీ భువిన్ పడెడు నిత్యవిలాప విషాద వేదనల్   
దాసుడు విన్నవించగల స్థైర్యమొసంగుమ వేంకటేశ్వరా. 01

వ్రాసెదనెప్పుడైననొక పద్యము రమ్య పదాల మాలగా
వేసెద నెప్పుడైన నొక వేషము ప్రేక్షక రంజకమ్ముగా
చేసెద నెప్పుడైన నొక శ్రేష్టపుకార్యముసంఘశ్రేయమున్ 
మోసెద నెప్పుడైన పరమోత్తమ బాధ్యత వేంకటేశ్వరా. 02     

చేసిన పాపమేదియును ఛిద్రముజేయక మానదెప్పుడున్ 
ఏ సమయంబునో పడగ నెత్తుచు ఘోరపు కాటువేయదే
మీసము త్రిప్పినన్ ఘన సమీకృత పూజలనెన్నిజేసినన్
ఆ సమయంబు వచ్చువరకన్నది సత్యము వేంకటేశ్వరా. 03

 మోసము జేయవచ్చు పరమోన్నత రూపున సాటివారినే
ధ్యాసనుమార్చవచ్చుపలుదారులు ద్రొక్కినిజంబుదాచుచున్
త్రాసపు నాత్మనేవిధిని ధర్మవిధంబని నమ్మ బల్కునో 
శాసన కర్త చెంతనిక సత్యము దాగునె వేంకటేశ్వరా. 04

వదలని స్మార్టుఫోను సహవాసము వాట్సపు ఫేసుబుక్కులున్
ముదిరిన ట్విట్టరుల్ మనలముంచును కాలమువ్యర్థమే గదా
పదనుగ విద్య నేర్చిమన భారత సంస్కృతి ఖ్యాతి పెంచగా     
నెదిగిన  బాల బాలికలభీప్సిత శక్తులు వేంకటేశ్వరా. 05

హెచ్చెను రోతకార్యములు హింసలసాంఘిక కృత్య రోగముల్
పెచ్చిలె లంచముల్ వెకిలి ప్రేమలు హత్యలు మానభంగముల్
పిచ్చిగ మారె సంస్కృతియు వేదన నింపగ జీవితంబులన్
వచ్చె స్వతంత్రమంచు గడు వేదన నొందిరి  వేంకటేశ్వ‌రా. 06

తట్టదె మానవాళికట దారినినిండిన చెత్తనెత్తగన్
పుట్టవె స్వచ్ఛభారత నవోదయశుద్ధ మహత్వయోచనల్
చుట్టవె కల్మషోజ్వలిత శోకపు రోగములన్ని చిత్తమున్
పట్టిన బూజుదుల్పవలె వారిని మార్చగ వేంకటేశ్వరా. 07

పేగును త్రెంచిజన్మనిడె ప్రేమము నింపెను  ఉగ్గు పాలతో
త్యాగముజేసి సర్వమును యజ్ఞమయమ్ముగ పెంపుజేసెనే
ఆగము జేసి వృద్ధుల ననాథ గృహంబున చేర్చెకౄరుడై
ఆగిన గుండె చూచుటకు నాతడు రాడట వేంకటేశ్వరా. 08

మాటలు కూల్చు కాపురము మాటలు చంపును రక్తమోడకన్ 
మాటలు బాంబులై సమసమాజము నంతయు ప్రేల్చివేయునా
మాటలె మంత్ర పూరిత సమంచిత శుద్ధిని శాంతి నింపునే
మాట మహాత్మ్యమున్ గనగ మాటలు నేర్పుమ వేంకటేశ్వరా. 09
 
భర్తొక సెల్లుఫోను తన భార్యొక సెల్లున సొల్లులాడుచున్
ఆర్తికి చోటులేదు సమయంబును లేదట  ప్రేమ పంచగా 
నర్తనమయ్యె జీవితము నవ్యవినోదపు యాంత్రికంబులౌ  
మూర్తుల యందు నింపవలె మోహనరాగము వేంకటేశ్వరా. 10

తానొక కాల చక్రమన  ధర్మము తప్పక సాగు జేయుచున్
మానవ కోటికన్నమిడు మాన్యుడు రైతని చాటిచెప్పినన్
కానక గిట్టుబాటు ధర కమ్మనిపంటయె దోపిడీయవన్
మానని గాయమున్ పురుగు మందును గ్రోలెను వేంకటేశ్వరా. 11

పడిశము పట్టెనంచునొక వైద్యునిజేరగనాతడువ్రాసె టెస్టులన్
వడిశలపట్టి కొట్టువిధి వాయగ గొట్టిరి సొమ్ములూడ్చుచున్
దడదడబుట్టె మందులకు ద్రవ్యము గూర్చగ దారి దోచకన్
బెడిదముగూర్చెవైద్యవిధి బిల్లును జూపగ   వేంకటేశ్వరా.  12

పాపకు మొగ్గవంటి చిరుబాల్యపు భాగ్యము దక్కకుండగా
కాపటి కామసర్పమయి కాటిడి ఛిద్రముజేసెను జీవితంబునే
పాపము తల్లిదండ్రులకు బాధను నింపగ   దేశమంతటన్
దీపము లెల్ల వెల్గినను తీర్పులు శూన్యము వేంకటేశ్వరా. 13 

శిక్షణ గోరిపుత్రికను చేర్చెను ఛాత్రగృహంబు నొక్కటన్
రక్షితకేంద్రమంచు పలురాష్ట్రములందున పేరుగాంచెడిన్
అక్షరధామ క్షేత్రమున నాశగ కామపిశాచ రూపి సం
 రక్షకుడయ్యు రాచి తన ప్రాణముదీసెను వేంకటేశ్వరా. 14
 
కుక్కను కుక్క కోల్పులిని కోల్పులి పిల్లిని పిల్లిజంపునే
ఎక్కడనైన జంతుతతులిట్లు స్వజాతిని  చంపుచుండునే 
ఇక్కడ!మానవుండుకడు హీనత జంపు ను తోటివారినే
మక్కువ మీర నింపగదె మానవతాత్మను వేంకటేశ్వరా. 15

పాడు కరోనకాలమున ప్రాణము బోయెను పిల్లలందరున్   
జూడగ దేశదేశముల సొక్కుచు నుండిరి ద్రవ్యమోహులై 
మోడును జేర్చి ఫ్రీజరున ముక్తిని గోరిన ప్రాప్తముండునో
పాడెను మోసి నిప్పునిడు వారసు లెవ్వరొ వేంకటేశ్వరా. 16

కామము నెత్తి కెక్కి కని కన్నులు విప్పని లేత గుడ్డునే 
సౌమనసమ్మొకింత గనజాలని జారిణి జారవిడ్చెనా
దోమలు పంది కుక్కలును దొర్లెడు కంపగు చెత్తకుప్పలన్
ప్రేమలనాథ జీవులను పెంచుట తప్పగు వేంకటేశ్వరా. 17

బంధములన్నియున్ పలుచబడ్డవి పచ్చనినోటు ముంగిటన్
బంధితమయ్యె సంపదల పాదము లొత్తుచు సద్గుణాలి, దు
ర్గంధపు స్వార్థభావనల గ్రాలుచు పెంచగ తల్లిదండ్రులున్
అంధక వారసత్వమగు నాసుతు జూడగ  వేంకటేశ్వరా. 18

మనుజుని మానసంబున క్రమంబున దూరెడు కంటిమంటయే 
మనమున చింతరూపముగ మారి దహించును జేర్చునాచితిన్
ఘనమగు తృప్తితోడ తగు గ్రాసము నొందుచు నుండ కున్నచో 
కనబడ నట్టి కీటకము కాలుని మించును వేంకటేశ్వరా. 19

ఏరున పడ్డవాడు మరణించడు వానికి నీతవచ్చుచో
ధీరతనొప్ప వేగముగ తీరము జేరు ప్రవాహముండినన్ 
తీరవు చిక్కులంచు పలుతీరుల వేదననొంది యోడకన్
నేరిమి తోడ గెల్వవలె నేర్పరు లెప్పుడు వేంకటేశ్వరా. 20


కాలుని పిల్పుతో చితిని కాలెడు కాయము తోడుతన్
కాలునుకాంక్షలున్ ధనము కామితబంధము స్వార్థబుద్ధులున్
కాలని దొక్కటై "చిలుక"  కర్మల సారపు మూటనెత్తుచున్ 
తాలుచు దేహవస్త్రములు తప్పని జన్మల వేంకటేశ్వరా. 21

ద్వారము దాటినట్టి వనితామణి దేహముపైన కాముకుల్
స్వారిని జేయుచుందురనివార్యపు చూపుల మంటపెట్టుచున్
 దారులు కాపుగాచి లలితాంగుల మానము ప్రాణముల్ గొనన్
వారల రాక్షసాధముల వట్టలు గోయరె వేంకటేశ్వరా.  22
 
కాటికి కాలుజాపుకొను కల్మష వృద్ధుల చేష్టలందునన్
కూటమిగట్టు కుర్రల ప్రకోపపు దారుణ మృత్యుకేళినిన్
కాటికి జేరుచుండ్రు పలుకాంతలు విచ్చని పూలమొగ్గలై 
పాటలగంధి రక్షణమె పాడియగున్గద వేంకటేశ్వరా . 23

క్రమమును దప్పె కాలమును కాముకుడయ్యె నరుండు స్వార్థభా
వముపరమార్థమయ్యె మతవాదము హింసను నింపే భారతిన్
సమతకు చోటు శూన్యమలసత్వమునిండె సమాజమంతటన్
మమతలు మాయమయ్యె ధనమాంత్రికుడేలగ వేంక టేశ్వరా.  24
 

సుందర భారతాగ్రమున జొచ్చిన క్రూరు లు తీవ్రవాదులీ 
వందిత వేదభూమి పురవాసుల రూపున దుర్మదాంధులై 
అందరు జూచుచుండ పలు హత్యలు జేసెడు దానవాళిసం
బంధుల జంపువాడె గుణ భద్రుడు వీరుడు వేంకటేశ్వరా.  25
 
సర్వము నేనెయంచు కనుసన్నల నుంచెద ధాత్రినంచు  నే
గర్వము నొందుచుంటి తను కాంక్షల భ్రాంతిని వీడకుండగన్
నేర్వక యుంటి సత్యమును నేనను భావమె నిండె నామదిన్
ఖర్వము గాక ముందె బ్రతుకంతయు బ్రోవర వేంకటేశ్వరా.  26

లంచము లాంచనంబయెను లాభమె మానవ జీవితంబయెన్
వంచన భూషణమ్మగుచు బాటలు వేసెను శుక్రనీతికిన్
కొంచెపు బుద్ధులేపెరిగి కొంపలు గూల్చె ను శాంతిజచ్చెనే
మంచికి కాలమున్ గలదె మానిసి మారునె వేంకటేశ్వరా. 27

ఓటుకు నోటువేసి గెలుపోటములందు సురాసురీప్రియుల్
పాటుపడంగ గెల్చెదరు పౌరుల నమ్మక మంత వమ్మవన్
కోటికి పడ్గలెత్తెదరు కూల్చుచు నీతియు  న్యాయధర్మముల్
ఓటరు నోడిపోయె గెలుపొందె నధర్మము వేంకటేశ్వరా. 28
  
నా పొలమాక్రమించి వరినాట్లను వేయుచు నన్నుఁగొట్టగన్
 కాపుగ నుండ గోరుచు షికాయతు చేసితి రక్షణార్థినై
పాపపు లంచగొండులగు పాలక బాధ్యులు నాదు భూములన్
చూపిరి వానిపేరిటను చూడవె దుస్థితి  వేంకటేశ్వరా. 29


ఊడ్చిన చెత్తనంతకడు యుక్తిగ వేయుచు ప్రక్క కొంపలో
ఏడ్చిన లాభమేమి పరులేయగ చెత్తను నాగృహంబులో
పూడ్చుచు నిట్టిలోపమును పొందికతో నిడ చెత్తబండిలో 
తుడ్చినగాజుబిల్లలుగ  తోచవె శాలలు వేంకటేశ్వరా. 30

రేపును చేయువాడొకడు రేపటి దోషి మ‌రొక్కడై జనున్ 
పాపమమాయకుండు తలవంచుచు శిక్షలు పొందుచుండ నా  
పాపి యదృచ్ఛగా తిరుగు పైకము జల్లుచు నిర్భయత్వమున్ 
చూపును దర్పమున్ పదవి సోకుల నెంతయొ వేంకటేశ్వరా.  31
 
కాలిడె కోటియాశలను కట్టుచు కొంగున మెట్టినింటిలో
కాలుని దూతలా యనగ కాంతుడు నత్తయు నాడుబిడ్డలున్
ప్రేలుచు శాపనార్థములు పెట్టిరి హింసలు వేనవేలుగా
కాలెను మానవత్వమట క్రౌర్యపునగ్నిని వేంకటేశ్వరా.  32

 కూడె విదేశ బంధమని కూతురు పెండ్లిని చేసెగొప్పగా
వాడొక మోసపూరిత వివాహిత హింసక కీచకుండవన్
కాడును చేరె కూతురట కానని దేశము నందభాగ్యయై 
వీడదె భ్రాంతి ఫారినను వేడుకలందున వేంకటేశ్వరా. 33
 
రిస్కనియెంతచెప్పినను రేయిఁబవల్లును వీధులందునన్
మాస్కులు శానిటైజరుల మాటయెలేక సమూహయాత్రలన్  
తస్కరులై కరోనను సుతారముగా ప్రవహింప జేసెడున్
పస్కల రోగు లందరను వారణ జేయవె వేంకటేశ్వరా.  34
 
త్వరిత ప్రసారసాధనకు వాట్సపు ట్విట్టరు ఫేసుబుక్కులన్
విరివిగ వాడుటెప్పుడును భీతవహమ్మన   జాలరెవ్వరున్
దురిత మనస్కులౌచు తమ దోషపు కృత్రిమ ఖాత తోడుతన్
తరచుగ మోసగింత్రుబెడిదంబుగ ద్రోహులు  వేంకటేశ్వరా. 35
 
సోమరిపోతులై యసుర సూతుల యంశనసంచరించుచున్
ప్రేమల పేర వెంటపడి వేపెదరా సుకుమార బాలలన్
వేమరుపెట్టు  హింసలును  భీతిని గొల్పు కరాళ నృత్యముల్ 
తామిక తాళ లేమనుచు ధాత్రిని వీడిరి వేంకటేశ్వరా. 36

ఆసిడు దాడులా కుటిల హత్యలు క్రూరపు మానభంగముల్
మూసెను మానవత్వపరమోత్తమ మార్గము,న్యాయ సత్త్వముల్
కాసుల కాలు క్రింద పలుకాడక పట్టెను  మూగనోములన్
శ్రీసఖ ! భద్రకాళులను జేయవె స్త్రీలను వేంకటేశ్వరా.  37

విజయమునొంద శీఘ్రమగు విశ్వపు మెట్లవి  లేవు లేవు తం 
త్రజనితమాయలేవియును,తప్పదు స్వీయప్రయత్నమెంతయున్
నిజబల యోజనంబులు వినీత విశుద్ధ ప్రయోజకత్వముల్
రజత మనంబు శ్రద్ధ యొనరంగ జయమ్మగువేంకటేశ్వరా. 38

ఆగ్రహమెట్లువచ్చె పలుకాడనిసాక్ష్యములౌచుకూడలిన్
విగ్రహ రూపులై నిలువ విశ్వవిరాజిత విజ్ఞులెందరో
ఉగ్రత తోడ ధ్వంస హృదయోజ్వలనంబున కూల్చివేయగా
వ్యగ్రత నింపె సంఘమున వారణ సేయుమ వేంకటేశ్వరా. 39

 క్రమమునుదప్పెకాలమన కాముకుడయ్యెనరుండు స్వార్థ భా
వమె పరమార్థమయ్యె మతవాదము హింసనునింపెభారతిన్
సమతకు లేదుచోటు నలసత్వము నిండె సమాజమంతటన్
మమతలుమాయమయ్యె ధన మాంత్రికుడేలగ వేంకటేశ్వరా. 40

సర్వము నేనెయంచు కనుసన్నల నుంచెద ధాత్రినంచు నే 
గర్వము నొందితిన్ తనువు కాంక్షల భ్రాంతిని వీడకుండగన్
నేర్వక యుంటి సత్యమును నేనను భావము నిండియుండగా 
ఖర్వము జేయుచుండెనను కావగ వేడెద వేంకటేశ్వరా.  41

విద్యయు వైద్యముల్  గనగ పేదకు నందనిద్రాక్షలయ్యె నై
వేద్యములాయెనాద్వయము విత్తపుమూటల భూవిరాట్టుకున్
బాధ్యత లేని శాసకులు వారికి వేయగ నెర్ర కార్పెటుల్
చోద్యము నంది దీనులిట క్షోభను పొందిరి వేంకటేశ్వరా. 42

సుందర భారతాగ్రమున జొచ్చిన ముష్కర తీవ్రవాదులీ
నందన దేవధామమున నర్తిలు చుండిరి దుర్మదాంధులై
అందరు జుచుచుండ పలు హత్యలు చేసెడు దానవాళి రా
బందులజంపి శాంతి మయ భారతి జేయవె  వేంకటేశ్వరా. 43

పండిన పంటకున్ తగిన పైకపు మూల్య ము లేకపోవుటన్
మండిన రైతుసోదరులు మార్కెటునందున కాల్చిధాన్యమున్
వెండియు నాత్మహత్యలకు వేదిక లయ్యిరి వేదనాత్ములై
 అండగ నిల్వ గావలయు నందరు రైతుకు వేంకటేశ్వరా. 44
 
అడవులుమాయమయ్యె వనజంబుల కాకలి దప్పులేర్పడన్ 
వడవడి జేరె గ్రామములు వాసము జేయ జనాటవిన్ సదా 
గడబిడజేయుచున్ పుర విఘాత భయోధృతినింపె నక్కటా
ఎడదల బాదలీవిధి యథేచ్ఛగ జెప్పెను వేంకటేశ్వరా. 45

సృష్టిని పోలు సృష్టి తగ జేసెను గాధి సుతుండెప్పుడో
స్పష్టమునయ్యెనేడదివెసన్ నకిలీలను వస్తుజాలమున్
కాష్టముజేరె నైతికత కాసులవేటయె వ్రే టు వేయగా
నిష్టగ స్వచ్ఛభారతికి నేడవి తూట్లయె వేంకటేశ్వరా. 46

శ్రీగిరిజాసరస్వతుల క్షేత్రములందున పూజ జేయుచున్ 
వాగుచు కొట్టుచున్ సతుల చంపుచునుందురు హీనబుద్ధులై
ఆ గుడి లోని దేవతయె నాసతియంచును గౌరవించుటే
బీగము శాంతి  సౌఖ్యములు ప్రేమల కెప్పుడు వేంకటేశ్వరా. 47

పల్లెలు మూగవోయినవి వందలువేలుగ పిల్లలందరున్
మెల్లన పట్టణంబులకు మేలుగ జార నుపాది కోరుచున్
పిల్లులు బల్లులన్ వలెనుపెద్దలువృద్ధు లు నంగలార్చుచున్
తల్లడ మందుచుండ్రి పరితాపము మాన్పవె వేంకటేశ్వరా.  48

ధరలు నభంబు జేరి నవతారలచెంతన మండుచుండగా 
సరుకు క్రయించ లేక ప్రజ సంతలలోన  విషాదమగ్నులై
పరుగిడిరే క్షుధార్ధు లయి పాపమదేమి  విషాద కర్మమో
నిరతము నారునీరునిడి నింపుము వెల్గులు వేంకటేశ్వరా. 49

తిరుమల కొండలేడనుచు దివ్యపురాణ ములన్ని చెప్పినన్
కొరవడి భక్తిభావమది కొందరు కొండల నాక్రమించగా
సరియగుతీర్పునివ్వగలసత్త్వ యతీంద్రియమూర్తి వౌటచే
స్థిరమగు దృష్టి నిల్పగనెతీరెసమస్య లు వేంకటేశ్వరా. 50

సహనముసన్నగిల్లె మనసంతయు నిండె నహంపు చీకటుల్
దహనములయ్యె బంధములుదాడులు హెచ్చెను బంధుమిత్రులన్
గహనపు జీవితంబులె వికల్పము నింపెను మానసంబులన్
వహనము తీరమున్ గను భద్రత నీదియె వేంకటేశ్వరా. 51

 ఇంటరునెట్టులే సకల మింటికి నెట్టుకు వచ్చుచుండగా
ఫంటరు నంచు యాపులను భద్రత గాంచక సెల్లులోనికిన్
ఎంటరు చేయ వైరసులునెవ్వడొ హాకరు వచ్చిచేరుచో
మెంటలు వచ్చె సర్వమును మ్రింగగ ఫోనున వేంకటేశ్వరా. 52

 తీయని మాయమాటలు సుదీప్తపు మోసపు హావభావముల్
వేయగ గాలముల్ పడిన వెంటనె  చేతురు బ్లాకు మెయ్ లొకో
మాయురె నీయెకౌంటు ధనమంత హుళక్కియె భాషణంబనన్    
చేయగ నట్టిచాటదియె చేయును విచ్ఛితి  వేంకటేశ్వరా.  53

యానముజేయు ఛోదకులు హద్దులు మీరుచు వేగగాములై
కానరు నెత్తుపల్లములు కానరు వాహన సంజ్ఞ లేవియున్
కానని లోకముల్ వెడలి కన్నఱ నిత్తురు కన్నవారికిన్
కానరు కాల పాశికుని కాసర మెంతయు వేంకటేశ్వరా. 54

మద్యపు మత్తులో నడుపు మార్గము గానరు బుద్ధిమాంద్యతన్
బాధ్యత గుర్తురాదు తమవారును దోచరు జోషునందునన్
ఆద్యము పోయిచుండు తనువందున చేరిన కల్లుసారలున్
విద్యయు విజ్ఞతల్ మరచి పీనుగులౌదురు వేంకటేశ్వరా. 55
 
పుట్టిన వెంటనే మమత పొంగగ నిత్తురు   సెల్లుఫోనులన్
ముట్టుచునొత్తుచుండ మదిమోహము ప్రేమయు పొంగునెంతయో
పెట్టుచుచేతిలోనెపుడు వెళ్ళెదరమ్మలు వంటశాలకున్
పట్టద దెంత కీడగునొ వానికి రేపది వేంకటేశ్వరా. 56

 మీసముగడ్డముల్ నుదుట మించిననామము కావి వస్త్రముల్
 ఆ సగమాటదేవరకు హ్లాదమొసంగునె భక్తిలేనిచో
వేసము కన్నమిన్న తన విశ్వసనీయత  భక్తిశ్రద్ధలా
శ్వాసయు ధ్యాసయున్ కలిపి సాధన చేయరె వేంకటేశ్వరా. 57

 మేలొన గూర్చు మాదు కరమించుక  సోకిన నీ శిరంబుపై
త్రోలెద దుష్టశక్తులను రోగములన్నియు మాయమంచు బా
బాలుగ సాధురూపులుగ పల్కుద రెన్నియొ మాయమాటలన్
వేలకు వేలు దోచెదరు  భిక్షుక రూపులు   వేంకటేశ్వరా. 58

 తీరని వేదనల్ మిగిలె  తీరము దాటిన పిల్లలిద్దరున్
తీరిక లేనివారిగ విదేశములందుననిల్చి యుండగా
వారిక రాము రామనగ పార్థవ దేహము పాచిపట్టుచున్
చేరె స్మశానమున్ నవత జీవన శైలికి సాక్ష్యమై యిలన్. 59

నాలుక జారెడున్ పలుకు నష్టము జేయును క్రూరమైనచో
మేలగు యోచనాన్విత సుమిత్రపువాక్కులె స్పూర్తి యోగ్యముల్
గాలము నందు చిక్కిన వికల్పపు మత్స్యము వోలె మాటయున్
ప్రేలిన ముప్పు దెచ్చునది  రేపును గాయము వేంకటేశ్వరా. 60

 బానిస జీవితమ్ము మసివారిన కోర్కెల వాహకమ్ము న
జ్ఞానపుమోహబంధములు సాంద్రపు బాధ్యత లన్ని మూపుపై 
పూనుచు నే చరించినను పొందెద  కష్టము లంచు నెద్దునై
గానుగ నెక్కి సాగవలె కర్మఫలంబన వేంకటేశ్వరా. 61

 కోరిన వృత్తియే దొరికె క్రొత్తగ కీలక మైన శాఖలో
 చేరగ స్వార్థచింతనము శీఘ్రమెపొందుచు ద్రవ్యరాశులన్
చోరుని వోలెనమ్మె పలు చోటుల శస్త్రపు మ్యాపులన్నియున్  
క్రూరుడు మాతృ ఘాతుకుడు కూల్చవే   వానిని  వేంకటేశ్వరా. 62

వాడొక త్రాష్టుడయ్యె బడి పంతులు కీచక టీచరుండనన్
వేడిన పాప వద్దనుచు వేదనపెట్టెను లైంగికంబుగా
గోడును దెల్ప పోలిసులు కొట్టెడు దెబ్బలకున్ జనించ నా
యేడుపు, బాల చిత్తమున హృష్టిని నింపెను వేంకటేశ్వరా.  63

 ధర్మము తప్పుచున్ ముసలితల్లిననాథ గృహంబునుంచగా
శర్మము దూరమై గడిపె శాంతియు సౌఖ్యము పూజ్యమౌటచే
కూర్మిని పంచునట్టి తన  గార్వపు కుఱ్ఱయునట్లు చేయగా   
కర్మము నిట్టి రూపమున కాంతురు జీవులు  వేంటేశ్వరా. 64

"రా" బడికంచుపిలుతురు రమ్యసుధామయ వాజ్ఞ్మయంబునన్ 
రాబడి కేగదా  తమను రమ్మని పిల్చుట కార్పొ "రేటులున్"
గాబర పెట్టివేయుదురికన్ పలు ఫీజులు లెక్కలేకయే
సాగవు నీదు ప్రార్థనలు చంపుకు తిందురు  వెంకటేశ్వరా. 65

 భూముల నాక్రమించి తమ భూమిగ మార్చుచు దుండగీడులా
స్కాముల నెన్ని చేసినను కాముగ నూతము నిచ్చు పాలకుల్
వాములు మ్రింగు స్వాములకె వాటగు న్యాయము దక్కునిప్పుడున్
ఇమ్మనుజాది"జాదు"లను విచ్ఛితి జేయుమ వేంకటేశ్వరా. 66

దేవుని భూములన్ నగలు తేరులు విగ్రహ మూర్తులన్
సేవల పేరిటన్ నటన జేయుచు పెద్దలు సంగ్రహించగా
పావన భక్తులై గుడిని వచ్చెడు వారలు దుఃఖమందిరే
దైవమ నీకు నీవుపరిదానము సేయుమ  వేంకటేశ్వరా. 67

 మత్తుపదార్థ పంపకము  మారణ దారుణకాండ సల్పగా 
విత్తన మయ్యె నాబడిని పిల్లల చాక్లెటు రూపమెత్తుచున్
చిత్తయె చిత్రసీమ పలు సీక్రెటు నాయకులెందరెందరో 
మత్తిడు డ్రగ్గు మాఫియ నిమంత్రులె చోద్యము వేంకటేశ్వరా.  68

స్వార్థ పరత్వకాంక్షితుల ఫాక్టరి చిమ్ము విషాన్వయంబులౌ
వ్యర్థపదార్థముల్ పొగలు వాయువు దుష్టరసాయనంబులున్
విస్తరణంబు కాగ  ప్రజ వేదననొందిరి రోగపీడనన్
దుస్థితి మాన్పుపాలకులు దూరమునుండిరి వేంకటేశ్వరా. 69

నేటి వివాహబంధములు నిశ్చల ప్రేమకు నోచకోవనన్
ఘాటగు మాటలన్ సతము కయ్యము లాడుదురిద్దరిద్దరై
ధీటుగ నేను నేనని  ప్రతిష్టకు పోయెడు కాపురంబులన్
 గోటికి పోవుదానకిక గొడ్డలి వేటగు వేంకటేశ్వరా.  70

భర్తను వీడుచున్ ప్రియునిబట్టిన దేలనొ మోహనాంగి తా
హర్తగనుండలేక పతి హత్యకు పాల్పడి రిద్దరక్కటా
యుక్తియుక్తమున్ శవము నొక్క వనంబున పాతిపెట్టి, గా
ఢార్తిని కూడియుండ రక్షకభటాళికి  చిక్కిరె వేంకటేశ్వరా. 71

మద్యపు బానిసై  పనులు మానుచు డబ్బులేక నా
హృద్యపు సంతతిన్ సతిని హేయపు మాటలు దండనంబులే
ఖాద్యముగానిడంగ నరకమ్మయె నాగృ హసీమ వారికిన్
వైద్యమునీయవే వసతి స్వర్గము జేయగ వేంకటేశ్వరా.  72

 మాయముగుట్టలన్నియు విమానములాయన రెక్కలూపుచున్
చేయగ రాళ్ళురాళ్ళుగ విచేతన పాలక నాయకత్వమున్
మేయుచునుండ్రి కొండలను మేలిమి సంపద రిత్తపోవగా
హాయిగనుందువేగిరుల హానిని గాంచుచు వేంకటేశ్వరా. 73

చేయనినేరమున్ పడును శిక్షలు దోషియె కానివానికిన్
హాయిగదోషులందరును హ్లాదము తోడుత రాజ్యమేలగా
ధీయుత శక్తులిట్లుధన  దీప్తుల ముందర దేహిదేహనన్ 
న్యాయపు కళ్ళగంతలు నయంబున విప్పవె వేంకటేశ్వరా.  74

కుంటనయున్న దున్న కొన కొమ్ములు జూపుచు బేరమాడుటన్
తుంటరి లక్షణంబు పలుదిక్కుల నిండెను మార్కెటందునన్
కంటిని మాయజేయుచును కౌటిక వృత్తిని దోచుకుందురీ
ఇంటిని వంటి నక్కట యధేచ్ఛగ క్రేతలు  వేంకటేశ్వరా.  75

దేవుడనంచుసర్వము మదీయ మహాత్మ్యమునంచుచెప్పుచున్
సేవక బృంద విస్తరణ చేయుచు సర్వము నాక్రమించిరీ
పావన భారతిన్ కలుష వైతరిణీ నది జేసినారహో 
తావక ధర్మమున్ విడిచి తాటకు లయ్యిరి వేంకటేశ్వరా. 76

ఉమ్మడి కాపురమ్ములుసువీక్షణఁజేసెడు పెద్దలుండగా
కమ్మగ సాగె స్వాస్థ్య శుభకాంతుల రంజిలు పూర్ణ చంద్రిమన్
బామ్మలు తాతలున్ నిరత బాధ్యత లన్నియు నాచరించగా
గుమ్మడి పండులై పెరిగి గెల్చిరి పిల్లలు వేంకటేశ్వరా. 77

కొమ్మలులేనిచెట్టు మరుగుజ్జు కుటుంబమటంచు నెంచగన్
అమ్మలునాన్నలే సకలమంచన వారును వృత్తి బాధలన్
కుమ్మరి సారె వోలె గిరి  గీయగ గిర్రున తిర్గుచుందురే
చెమ్మగిలున్ స్తనంధయుల చిక్కులు గాంచగ   వేంకటేశ్వరా. 78

చుట్టును చుట్టుముట్టె పలు క్షేత్రము లందు కరోన వైరసుల్
పట్టెను జీవరాశి సుఖవంతపు జీవితముల్ నశింపగా
కట్టడి చేయనొంటరిగ కాలము పోనిడు చుండ వచ్చెనే
చుట్టపు పెండ్లి చావులును చూచుట సాధ్యమె వేంకటేశ్వరా. 79

ధీమతుడౌచు నామతమిదేనని లెక్కకు మించునట్టి సం
క్షేమప్రయోజనంబులను చిమ్మగ నేలిక ముందుచూపుతో
సోమరిపోతులై ప్రజలు షోకుగ తిర్గిరి మందబుద్ధులై 
తామునువోటువేసిరిక ద్రవ్యమహాత్మ్యము వేంకటేశ్వరా.  80

బారులుప్లబులున్ నడుచు బారులు తీరుచు సంభ్రమమ్మునన్
వారల రాజకీయపరమైనమహాసభలన్ని నడ్చు వ్యా
పారపు మార్కెటుల్ ఘన విభాసిత రీతిని వెల్గుచుండ నీ 
భారతి మందిరమ్ములవి పాపము చేసెనె వేంకటేశ్వరా. 81

చిత్తము నందునుండి తన చేతనతో నడిపించు దైవమున్
రిత్తగ నెంచి యేగితిని శ్రీకరు దర్శన మొంద  కోవెలన్
చిత్తరు వైతినచ్చట విశిష్ట విలక్షణ శీఘ్రదర్శ నం
బత్తరి విత్తరూపమున హారతి పట్టగ వేంకటేశ్వరా. 82

 విత్తనమింతమొక్కయగు వృక్షమగున్ ఋతువుల్ గతించగా
విత్తజమైనవృక్షమది ప్రేలుచు కూలును లిప్త మాత్రమున్
 ముత్తెము వంటినిర్మితులు ముచ్చట గొల్పును దీర్ఘకాలమున్
మొత్తము కూల్చివేయ క్షణ మొక్కటి జాలును వేంకటేశ్వరా. 83
 
 కార్యము వీడునోటమిని కారణ తుల్యత చేయకుండనే
కార్యముపట్టునోటమిని కాంచు జయ మ్మునుకార్యదక్షుడే 
స్థైర్యముతోడ జూచి గణుతించగ  నోటమి రెంటనొక్కటే   
కార్యముపూర్తిజేయుటకు  కావలె దమ్ము ధనాత్మకంబునై.. 84

వడ్డన జేసినట్టి పలు వంటక యుక్తపు విస్తరౌనొకో?
అడ్డము దిడ్డమై మనుగడంతయు దుఃఖ సుఖాలవాలమే
దొడ్డ మనంబునన్ వలయు త్రోవలు దొల్చుచు కర్మబద్ధతన్
గోడ్డుగ జేయగా పనులు కోర్కెలు దీరవె వేంకటేశ్వరా. 85

కలుషిత సంస్కృతీభయద కార్య కలాప విలాప యవ్వనుల్
పలుచనచేయుచుండిరి ప్రభాసిత భారత భవ్య సంస్కృతిన్
విలువలు జారిపోయినవి విజ్ఞతొకింత యులేక దీనమై
నెలవులుదప్పె నీగతిని నీతి నిజాయితి వేంకటేశ్వరా.  86

చీకటి దుష్ట కార్యములు జేయుచు నెవ్వరు చూడలేదనన్
ప్రాకట పంచభూతములు భానుడు చంద్రుడు నంతరాత్మ నీ
 కాకపు చేష్టలన్నియును కర్మఫలంబుల నిచ్చువేళలన్
చేకొనుచుందురన్నియున్ చీకటి మాన్పవె వేంకటేశ్వరా. 87

ఎండకు వానకున్ చలికి నెప్పుడు నిల్చుచు  బార్డరందునన్
దుండగులైన శత్రువుల ద్రుంచెడు ధీరులు  సైనికోత్తముల్
మెండుగ ధాన్య రాశులను మేదిని జీవులకిచ్చు దాతలై 
అండగ నుండు రైతులుమహాత్ములు జాతికి వెంకటేశ్వరా. 88
 
తోపుడుబండిపై సరుకు తుల్యత జేయుచు నమ్మువారినే
చీపుగ బేరమాడుచును చింతను నింపుచు వెక్కిరించితే
సూపరు మార్కెటందు గొన జూడగ తోపుడు బండినిచ్చిరే
పేపరుమీదనుండె ధర బేరము సేతురె వేంకటేశ్వరా. 89
 
చచ్చినతల్లిదండ్రులకు సాదము షడ్రుచి  వంటకంబులన్ 
స్వచ్ఛపు వెండిపళ్ళెమున వాయస మందగ పెట్టువాడహో
అచ్చపు భక్తితో పదములంటుచు  అమ్మనాన్నకున్  
పచ్చడి యన్నమైన కడుపారగ పెట్టడె వేంకటేశ్వరా. 90

 వందలకొద్ది వైద్యులు ప్రభావిత వైద్య మునెంతజేసినన్
సందడిజేయు కాలకరచాలనమెవ్వడు నాపలేడు గో
విందుడెదిక్కునాకనుచు విశ్వసనీయ ప్రపత్తి తోడుతన్
వందితమైన సత్క్రియల పాలనసేసెద వేంకటేశ్వరా. 91

మోహపుబంధగంధములె మూలము లౌచు నధర్మశక్తులై
ఆహుతి చేయుచుండె శుభదంబగు సుందర వేదసంస్కృతిన్
దేహపు శత్రుషట్కమున దేలుచు మున్గుచు మూల్గుచుండిరా
సోహమునే తలంపక నశుద్ధపుచిత్తులు వేంకటేశ్వరా. 92


సుందర భారతమ్ము సుమశోభిత ముగ్ధ  వశీకృతావనం
బందున శాంతసస్యముల హాంఫటు జేయ త్రిశంకువర్గ రూ
పందుచు నుగ్రవాదులు కుబుద్ధులు దూరిరి దొంగచాటుగా
అందరి నొక్కమారుగ హతంబును జేయవె వేంకటేశ్వరా. 93

 కలవరమందిరా జనులు కష్టపు పంటలు  నీటిపాలవన్*
తలచె ప్రభుత్వమున్ తగినద్రవ్య మునీయ, నుదాస్థితుండునా
ఫలమును బుక్కగా ప్రజలు వానిని యేసిబీకిడన్
ఎలుకలు మత్తవారణము  నీడ్చె  కలుంగుకు వేంకటేశ్వరా. 94


 రోజొక  మాఫియా బహుళ రూపము లెత్తుచు దోపిడీలతో
బీజము వేయుచుండె నవ భీకర రాక్షస మృత్యు కేళికిన్
తేజము లేనిచట్టమది తేలెను డబ్బుకు చుట్టమే యనన్
రాజిత సత్యమే విధిని శ్రాయముని చ్చును వేంకటేశ్వరా. 95

రక్తమునందు నిండి పలు రాక్షస తత్త్వము ద్వేష మోసముల్
రిక్తము జేయుచుండె చిగురించెడు శాంతిని ద్రుంచి వేయుచున్
తిక్తమునయ్యెమానవుల తీయని త్యాగవిశాల బంధముల్
 శక్తినొసంగుమా యువత జాగృత మవ్వగ వేంకటేశ్వరా. 96

మూగగ నాకరోన తనమూర్ఖత చేత నతండుచేరె వై
భోగము గూడు హోటలును పూర్తిగ నొంటరి జీవితార్థియై
సాగె చతుర్దశాహములు చక్కగ లక్షల బిల్లు నివ్వగా 
రోగముపోయి స్వస్థుడయి రోదన జేసెను వేంకటేశ్వరా. 97


కులమును బట్టిరాదు సమకూరదు వంశ ప్రయోజనంబుగా
వెలయును జ్ఞానమంతయు పవిత్ర ప్రయత్నవిశేష పుణ్యమై
అలసటలేని శ్రామిక గుణైక్యమె నింపును సద్గుణంబులన్
కలుగును వాటితోడ తగు జ్ఞాన ప్రపూర్ణత వేంకటేశ్వరా. 98

వేడిన వేడుగాని నిను వీడకయుండునె జీవుడెప్పుడో 
గోడను దూకు దొంగ విధి గుండెయు జారును చావు చీకటుల్ 
మూడును, వేణు మాధవుని   మోహన కృషుని చెంత జేరగా 
గాడిని పెట్టగా వలయు కర్మలు వాక్కులు వేంకటేశ్వరా. 99

అతివకు రక్షణంబనుచు నార్తిగ చేసిరి చట్టముల్ సభన్ 
వెతికిన కానరావుగద వీటిని వాడిన తీరు తెన్నులున్
చితికెను మూడు సింహములు సాధ్య ముగాదని కాపుకాయగన్ 
బ్రతుకిది జూడ!రాజ్యమున భద్రత కోల్పడె వేంకటేశ్వరా. 100

విప్పక జ్ఞాన మానసము వేడక జీవన దాతనెప్పుడున్
ముప్పునుపొందువారలిల ముఖ్యులు వారికిచెప్పుచుంటి"మే
కప్పును" తీసి గాంచవలె కైటభ వైరిని సత్య శోధ "వే
కప్పులు" లేని మానవుని కాల్చువె బాధలు వేంకటేశ్వరా. 101

ఆకలి నేర్పు ద్రవ్య తతినార్జన జేయు విధంబునెంతయో
భీకర యుద్ధమే విజయ విజ్ఞత నేర్పును విశ్వమేలగా
ప్రాకెడు దుఃఖమే నరుల పాలిట చక్కని  మోద మార్గమౌ 
చీకటియే వెలుంగునిడు జీవిత మిద్దియె వేంకటేశ్వరా. 102


కర్మఫలంబులే నరుల గాచును కాల్చును తత్ప్రమాణమున్
మర్మము లన్నియున్ గనుచు మానవ జన్మ పవిత్రతన్ గనన్
చర్మ శరీరమున్ గనక  సత్ప్రభ లందున  ఐహికంబునౌ 
ధర్మము వీడువారలకు దక్కదె మోక్షము వేంకటేశ్వరా. 103

సంపదలెన్ని యున్నను ప్రశాంతత తృప్తియు మృగ్యమైనచో
నింపు విషాదగీతములు ,నిండగుజీవిత మంత వ్యర్థమౌ
నింపుగ గడ్డియింట తన నెచ్చెలి, పిల్లల తోడ సఖ్యమౌ
సొంపగు నిద్ర కౌగిలిని జొచ్చిన జాలదె  వేంకటేశ్వరా. 104

జగడములాడుచున్ నిరతశత్రువువోల శ్రమంబు గూర్చుచున్
తెగడుచు నస్మదీయులను తీవ్ర పదంబులతోడ నెప్పుడున్
పగతుర నుగ్ర దేశముల పల్లకి  మోయుచు వారినెంతయో
పొగడెడు వారి ప్రాణముల బోరనఁ దీయవే వెంకటేశ్వరా. 105

విద్యయె మూలమీ జగతి వృద్ధికి దివ్య  వివేకబుద్ధికిన్ 
వేద్యము మానవాళికది భేద్యమనేక సమస్య లందునన్ 
చోద్యము కాదు నాశకర చొరుల జేర   దురాకృతంబు నౌ    
విద్య వినాశమూలము వివేక విహీనము వెంకటేశ్వరా. 106

కారణ మెవ్వడీ జగతి జాగృత శక్తికి,మూలమెవ్వడీ
ధారుణి పాలనంబునకు ధర్మము నిల్పగజాలునెవ్వడో
క్రూరులు రాక్షసాధముల కూల్చెడు శోభన మూర్తి యెవ్వడో
కోరద నట్టివాడవని గూర్చగ రక్షను  వేంకటేశ్వరా. 107

నీచరణారవిందనవనీత మహత్వ ప్రసాదలబ్ధ భా
వోచిత భాషణంబులివి యోర్మి ప్ర శాంతత సజ్జనత్వమున్
భూచరమానవాళికిని పూనిన జాలును ధన్యుడన్ గదా
శ్రీచకితార్ద్రమూర్తి  నవ చేతన నింపవె వేంకటేశ్వరా. 108

 

కృతి కర్త 
డా.  ఎన్.వి.ఎన్.చారి 
నల్లాన్ చక్రవర్తుల
వెంకట నారాయణ చార్య 
విశ్రాంత ప్రాచార్యులు 
ప్రధాన కార్య దర్శి , సహృదయ  సాహిత్య  సాంస్కృతిక సంస్థ, వరంగల్.  

వేంకటేశ్వరా శతకం
పుస్తకాలు
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.