మిడిల్ క్లాస్ బ్రతుకులు !
డబ్బులు చెట్టు మొలిచినట్టు
కోట్లలో ఖుషి అయిన జీవితం
బ్రతుకు మీద భయం లేక
రేపు అన్న బెంగ రాక
లెక్క డొక్కా లేని బ్రతుకులు !
విడిచిన బట్ట కట్టక
తినటానికి తీరుబడి లేక
దాచిన సొమ్ము లెక్క పెట్టలేక
నల్ల సొమ్ము విముక్తికి దానం చేసే కర్ణుడు
కలియుగ దైవంగా కొనియాడే కోటీశ్వరుడు!
రూపాయికి మరో వైపు...
రేయిపోద్దు కష్టపడతాడు
రేపు అన్నది ఉంటే దేవుడి దయనుకుంటాడు
ఈరోజు పొట్ట నింపితే చాలనుకుంటాడు
కలో గంజి తాగి బ్రతికేస్తుంటాడు
దారిద్యరేఖ దిగువన అస్తమించిన సూర్యుడు!
కర్మ ఫలితం అని సరిపెట్టుకుంటూ
పూట గడిస్తే పుణ్యం అనుకుంటూ
ప్రభుత్వాల చేయి విధిలింపుకే మురిసిపోతూ
ఉన్నంతలో రాజుల బతికేస్తున్నాడు!
వీడే అసలైనా పేదవాడు
దారిద్రరేఖపై అడుగులేసే దగాపడ్డ జీవుడు!
చావలేక బతకలేక
కుబేరుడితో పోటీపడలేక
కూలి వాడిలా మారలేక
ప్రతి నిమిషం బ్రతుకుని గుదిబండలా భావిస్తూ
ఐదంకెల జీతాన్ని అర్థ నిమిషానికోసారి లెక్కిస్తూ
పెరిగిన ఖర్చులను మోయలేక
బరువు బాధ్యతలను వీడలేక
నిత్యం నలిగిపోతూ ఉంటాడు!
పొదుపుకి కొత్త మార్గాలు అన్వేషిస్తాడు
పిసినారి అంటూ ముద్ర వేసుకుంటాడు!
అందరివాడు అందుకే అప్పులు వీడికి నేస్తాలు
ఏడాదికొకసారి పెరిగే ఇన్సెంటివ్ కోసం ఆశగా చూస్తాడు
రాలేదని తెలిసి బోరున విలపిస్తాడు!
ట్యాక్సలు కట్టలేక ఉన్నది సర్దుకో లేక
ప్రభుత్వాల వేటకు బలైపోయేవాడు!
వాడే మధ్యతరగతి సామాన్యుడు
ఇవే మా మిడిల్ క్లాస్ బ్రతుకులు!!
--జ్యోతి మువ్వల