392..
నా మదినే తెలుసుకున్న.. ఓ చక్కని పావురమా..!
చెలుని జాడ తెలుపుచున్న.. ఓ చక్కని పావురమా..!
మధుర మధుర ప్రేమ కథకు రాయబారివైనావా..!
స్నేహ సుధలు ఒలుకుచున్న..ఓ చక్కని పావురమా..!
మనసులోని మమకారము..ఉత్తరాన నింపుటేల..?!
చిలిపితనము దాచుకున్న..ఓ చక్కని పావురమా..!
పూస గుచ్చి ఇస్తున్నా..ఎదలోపలి ఆవేదన..!
అణువణువును మీటుచున్న..ఓ చక్కని పావురమా..!
వరదలైన విరహ మధువు..అందించవె ఈ లేఖగ..!
అరచేతను వాలియున్న..ఓ చక్కని పావురమా..!
ఆ 'మాధవ' యమునాతటి..చేరు దారి చూపుమింక..!
నా శ్వాసను ఆడుచున్న..ఓ చక్కని పావురమా..!