422..
పలకరించే అందమైన వనమంటే ఏకాంతం..!
పరిమళించే దివ్యమౌ పవనమంటే ఏకాంతం..!
అణువణువున దాగున్నవి కోటి ప్రేమ మందిరాలు..!
మందహాస నందనాల జగమంటే ఏకాంతం..!
మౌనానికి అద్దమల్లె నిలచి ఉంది ప్రతి హృదయం..!
నవనీతపు సోయగాల నగమంటే ఏకాంతం..!
ఏ చుక్కల తోటలోన ఏముందో మనకెందుకు..?!
దిక్కులన్ని చుట్టేయగ వరమంటే ఏకాంతం..!
కలహంసల నాట్యాలకు వేదిక నీ మనసేగా..!
కలతలన్ని కాల్చేసే పరమంటే ఏకాంతం..!
పరులెవ్వరు లేరు చూడు స్నేహజ్యోతి నీవైతే..!
అందేనిక..ఆ'మాధవ' పదమంటే ఏకాంతం..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు