446..
పరిమళించే వెన్నెలల్లే ఉన్న మనసును మరువ కెన్నడు..!
మౌన వీణై మ్రోగుతున్న హంస సొగసును విడువ కెన్నడు..!
చినుకు ఎదలో చిగురు తొడిగే పసిడి కాంతిని తరచి చూడగ..
మెరుపు సుధగా మారుతున్న మరుల సరసును కోర కెన్నడు..!
మొగ్గ గుడిలో నిండు తేనెల ప్రణయ వేణువు రాగమేదో..?!
ఆలపించే మట్టి కణముల మూగ వలపును కాల్చ కెన్నడు..!
ఇంద్ర ధనువుల చిత్తవృత్తుల కళలు మాన్పగ ఎవరి తరమౌ..?!
కలల వీధుల తిరుగు మబ్బుల ఆశ తలపును పట్ట కెన్నడు..!
గెలుపు ఒడిలో నిదురపోయే ఓటమెవరికి హాని చేయదు..!
పాఠమౌతూ ఎదుట నిలచె భావ వనమును పేల్చ కెన్నడు..!
రాధ పెదవుల అరుణ రాగము 'మాధవా'లయ దీప సిరియే..!
చూడ చక్కని జ్ఞాన గగనపు అమృత పథమును వీడ కెన్నడు..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు