శీర్షిక : అంతర్మధనం
నలిగిన మనసు కొస ఊపిరితో
ఆశగా చూస్తుంది!
మళ్లీ భూభ్రమణంలో
గతాన్ని తిరిగి మార్చాలని
అనుమానపు దుమ్ముదులిపేయాలని
అడ్డుగోడగా నిలిచిన అహాన్ని కూల్చేయాలని!
క్షీణిస్తున్న చంద్రునిలోని కాంతి పుంజంలా
నమ్మకమనే వెన్నెలను రాహు మింగినట్టు
మనసులో చెలరేగే తుఫానుకి
స్వాభిమానమనే కెరటాల పోటు తగిలాయేమో...
కండరాల బిగువులో కడలి కూడా
కాలువగా కనిపించింది!
వాస్తవానికి ఆశల గుర్రం అడ్డొచ్చి
అహంకార వస్త్రాన్ని తొడిగిన దేహానికి
అనుభవసారం ఆలింగనం చేస్తేగాని
తెలుసుకోలేక పోయింది
అంతా అయిపోయింది!
కడలి గర్భంలో దాగున్న
ఆలుచిప్పలోని ముత్యంలా...
నీ ఎదలో ఆవగింజంత ప్రేమ దాగి ఉంటుందని
అదే ఓదార్పు మంత్రమని తెలిసొచ్చింది
కానీ అవకాశం పోయింది!
నిండు జాబిలే వెలుగునిస్తుందని
అమావాస్య చీకటిని తొలగిస్తుందని
కన్నీటి దారులలో ఎదురుచూస్తూ
దరి చేర్చే నావ కోసం!
ఆత్మవిమర్శతో దహించుకుపోతూ
ఎడబాటులో కృశించి పోతున్న జీవితాలు!!
జ్యోతి మువ్వల
5/10/21