నెలవల సహజ
1/781,N.T.R.nagar, Srikalahasti.

కాలమే నీకు సమాధానం చెబుతుంది అని చాలా మంది అంటారు. అసలు ఏంటి ఈ కాలం, ఎవరు ఈ కాలం. నాకు ఎండా కాలం తెలుసు, చలి కాలం తెలుసు, వర్షాకాలం తెలుసు, మా కుటుంబ పరిస్థితుల వల్ల కలికాలం అంటే ఏంటో కూడా తెలుసుకున్నా. కానీ ఈ సమాధానం చెప్పే కాలం ఏంటో తెలియట్లేదు. ఎంత ఆలోచించినా అంతుచిక్కట్లేదు. ఎప్పుడు వస్తుంది ఈ కాలం అని ఎదురుచూస్తున్నా. ఇంక రాదేమో? 

           అసలు నాకు ఈ ప్రశ్న రావడానికి కారణం ఎవరనుకున్నారు? మా నాన్న. మా నాన్న గురించి చెప్పాలంటే , ఆయనకు దేశభక్తి ఎక్కువ. సమాజాన్ని బాగా ప్రేమిస్తారు. ఈ విషయం నాకు ఎలా తెలుసనుకుంటున్నారా? ఎందుకంటే మా ఇంటి కోసం కంటే ఆయన సమాజానికే తన జీతాన్నే కాదు, సమయాన్ని కూడా ఎక్కువ కేటాయిస్తారు, అంతేకాదు ప్రతిఒక్కరికీ తాను ఎలా ఉపయోగపడగలనని ఆలోచిస్తూ ఉంటాడు. దానికి నేనే సాక్ష్యం. ఒకరోజు మా అమ్మకి అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్ కి తీసుకెళ్లచ్చు కదా అని మమ్మల్ని అన్నాడు. అదే వీధిలో ఎవరికి బాగాలేదని తెలిసినా వారు అడగకపోయినా హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. పక్కఇంట్లో వంట చేసుకోలేదంటే మా ఇంట్లో బియ్యంతోపాటు మాకోసం చేసిన వంటలను కూడా వాళ్ళకిచ్చేస్తాడు. మా నాన్న గురించి చెప్పాలంటే ఒక పెద్ద గ్రంథమైన సరిపోదు. తన దగ్గర డబ్బులు లేకపోయినా, అప్పు చేసైనా ఆపదలో ఉన్నవారిని ఇస్తాడు.ఇస్తే ఇచ్చాడు , మళ్ళీ తీసుకోడు . ఆ తీసున్నవాళ్ళకైనా బుద్ధి ఉండాలికదా తిరిగి ఇవ్వడానికి అని మేము అనుకున్నా, మా అమ్మ ఎన్నిసార్లు చెప్పినా మా నాన్న మారడు, ఆయన అంతే  అని, మేము ఎన్నోసార్లు చెప్పినా వినడని తెలిసినా ఇప్పటికీ చెపుతూనే ఉంటాం.

        అవును నేను నా ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉన్నాను కదా మర్చిపోయాను , అంతే మా నాన్న గురించి తలచుకుంటే ఏదైనా మర్చిపోవాల్సిందే . సరే నా ప్రశ్న ఏంటీ, సమాధానం చెప్పే కాలం ఎప్పుడు వస్తుంది అని కదా? అవును ఎప్పుడు వస్తుంది? మొన్న మా పక్క వీధిలో ఒక ఆయన చనిపోయాడు. ఆయన ఎలాంటి వాడంటే పరమదుర్మార్గుడు, వాళ్ళ భార్యని, పాపం వాళ్ళ అత్తని రోజూ తాగేసి వచ్చి కొడతాడు. ఆ విషయం మా వీధికి మాత్రమే కాదు, చుట్టు ప్రక్కల వీధులంతా తెలుసు. ఆయన చనిపోతే చాలామంది వెళ్లి చూశారు, కానీ ఏడవలేదు. వాళ్ళ భార్య ఒక్కటే ఏడుస్తూ ఉంది. అందరూ అతని పీడ విరగడయ్యిందని ఏవేవో గుసగుసలాడుకుంటున్నారు. నాకు బాధ కలగలేదు ఆయన చనిపోయినదానికి. కానీ ఈ రోజు మా నాన్న గారికి ఆరోగ్యం బాగాలేకుండ వచ్చింది. మా నాన్న రోజూ తన స్నేహితులతో టీ తాగడానికి కనీసం పదిసార్లు వెళ్తాడు. ఆయనకు నిద్రపట్టదు. ఎప్పుడూ మెలకువగా ఉంటాడు. ఉదయం ప్రతిరోజూ 5గంటలకు బయటకు వెళ్లి టీ తాగుతాడు, అంతపొద్దున టీ పెట్టమంటే మేము విసుక్కుంటామేమో అని ఆయన మమ్మల్ని అడిగేవాడు కాదు. సరే ఈ రోజు మా నాన్న గారికి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల బయట అడుగు పెట్టలేదు. ఆ విషయం కొంచెం బయట తెలిసింది. అందరూ వచ్చేశారు మా ఇంటికి. కొంతమంది పండ్లు, కొంతమంది డబ్బులు, పక్కింటి ఆంటీవాళ్ళు వంటలు కూడా వండి తెచ్చిచ్చారు. చాలా మంది వచ్చేశారు. మా నాన్నని మేము హాస్పిటల్ కి తీసుకెళ్ళాము అని చెప్పినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చాలామంది డబ్బులు ఇచ్చారు. నేను మా నాన్నగారిని ఎప్పుడూ అంటూనే ఉండేదాన్ని ఎందుకు నాన్న మీరు అందరిని పట్టించుకుంటారు అని. అప్పుడు ఆయన చెప్పాడు , కాలమే నీకు సమాధానం చెబుతుందని. బహుశా ఆ కాలం ఈ రోజేనేమో. ఏమో ఏంటీ ఈ రోజె. అంతమంది వాల్లెవ్వరూ మా బంధువులు కాదు కానీ మా నాన్నకు బాగాలేదన్న మరుక్షణం వారంతా మా ఇంటికి వచ్చి పరామర్శించారు. అప్పుడు నాకు అర్థమైంది, డబ్బులు సంపాదించుకోవడం కాదు మనుషులను సంపాదించుకోవాలని. అప్పుడే నిర్ణయించుకున్న నేను కూడా మా నాన్న లాగా సమాజాన్ని ప్రేమించి , మనుష్యులను సంపాదించుకోవాలని , అలాగే మనం పోయినప్పుడు మన గురించి వందమంది గొప్పగా చెప్పుకోవాలని, మా నాన్నని నేను అపార్థం చేసుకున్నా అని. ఈ రోజు అర్థమైంది ఆ కాలం నాకు సమాధానం చెప్పడం వల్ల. 

         కానీ నేను ఇంకా ఎక్కడో ఈ వాక్యం విన్నట్టుంది, ఆ గుర్తువచ్చింది. ఎవరు అన్నారంటే మా పక్కింటి పంకజంఆంటీ. అంటే మా వీధిలో కొంతమంది ఓటుకు డబ్బు తీసుకుని ఓటును వేశారని కాలమే మీకు సమాధానం చెబుతుంది అని అన్నది. అది నాకు వినిపించేలా అనింది. ఇక నా మనస్సులో మళ్లీ అలజడి మొదలయ్యింది. ఇప్పుడు మళ్లీ ఆ కాలం కోసం ఎన్నిరోజులు ఎదురుచూడాలో అని అనుకున్నాను. అప్పుడు మా వీధిలో రోడ్లు బాగలేకపోవడం వల్ల రోడ్లు వేయాలని గెలిచిన నాయకునికి మా వీధిలో వాళ్లంతా అర్జీ ఇచ్చారు. కానీ అతను పట్టించుకోలేదు. అంతేకాదు మమ్మల్ని అసలు లోపలికి రానీయద్దు అని పి.ఎ కి చెప్పాడంట. అప్పుడు పంకజం ఆంటీ చెప్పింది ఆ రోజు నేను మీ అందరికీ చెప్పాను ఓటుకు డబ్బు తీసుకోవద్దు అని కేవలం 500రూపాయల కోసం5 సంవత్సరాల భవిష్యత్తును చేరిపేసుకున్నాం. ఆ రోజు నా మాట విని డబ్బు తీసుకోకుండా ఉండుంటే ఈ రోజు మనం ప్రశ్నించడానికి హక్కు ఉండేది అని చెప్పగానే వీధిలో వారంతా బోరున ఏడ్చారు. ముఖ్యంగా చెంగయ్యతాత బాగా ఏడ్చాడు. ఎందుకంటే వాళ్ళ కొడుకు రోడ్డుగుంతలు ఎక్కువగా ఉండడం వల్ల బైక్ స్కిడ్ అయ్యి కళ్లముందే చనిపోయాడు పాపం. తాను తీసుకున్న 500లకి తన కొడుకు బలైపోయాడని చాలా బాధపడ్డాడు. నిజమే అనుకున్నా. మరి ఆ రోజు డబ్బులు తీసుకోకుండా ఉండుంటే బాగుండేది అనే సమాధానాన్ని కాలం భలే చెప్పింది కదా! నిజమే దేనికైనా కాలమే సమాధానం చెబుతుంది అని నేను అనక మానలేను.

          సరే అని ఇంకా ఈ వాక్యాన్ని ఎప్పుడు విన్నానని ఆలోచిస్తూ ఉంటే మా అమ్మ ఏమి రాస్తున్నావు అని అడిగింది. కథ రాస్తున్నా అని చెప్పాను. ఎవరి గురించి అని అడిగింది. నీ గురించే అన్నాను. వెంటనే నా గురించా, ఏమని రాస్తున్నావు ? బాగా రాయి అన్నది. ఏముంది నీ గురించి నిజమే రాస్తాను, నీకు కుళ్ళు ఎక్కువ అని రాస్తాను అని చెప్పాను. వెంటనే ఇదిగో నాకేం కుళ్ళు, ఈ పిల్ల నాకు కుళ్ళు అని కథ రాస్తుందంట అని మా నాన్నకి చెప్పింది. నాన్న తిడతాడేమో అనుకున్నా కానీ నవ్వాడు. కొంచెంసేపు నవ్వుకున్నాం. ఆమ్మ మాత్రం నాన్న వెళ్ళాక నాకు వీపు విమానం మోత మోగిస్తుందేమో అని భయమేసింది. ఎలాగో ఆ దేవుడి దయవల్ల మర్చిపోయింది. హమ్మయ్యా గండం గడిచింది అనుకున్నా. 

ఇక మళ్లీ ఆలోచనలో పడిపోయా ఆ సమాధానం చెప్పే కాలం ఎప్పుడు వస్తుందా అని.

కాలమే నీకు సమాధానం చెబుతుంది
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
1
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
1 votes with an average rating of 1.