శిరసు వంచి అడుగుతున్నా.. ననుతెంచకు ఓ నేస్తమా..!
మౌనముగా వేడుతున్నా..ననుతెంచకు ఓ నేస్తమా..!
ప్రకృతి పూజ జరుగుతున్నది..చూడు కన్నుల పండువేగా..!
అక్షరాల కోరుతున్నా..ననుతెంచకు ఓ నేస్తమా..!
నీవు చేయి వేసినావో..పరిమళించే ప్రగతి నిలచును..!
తేనెలు నే పంచుతున్నా..ననుతెంచకు ఓ నేస్తమా..!
నీ ప్రేమను ప్రకటించగా..మనసు భాష నేర్చుకోవోయ్..!
నా ప్రేమను కురుస్తున్నా..ననుతెంచకు ఓ నేస్తమా..!
ప్రతి చినుకుకు తడిసి మురిసే చిన్ని కన్నియ మాట వినవా..!
నీ కోసం బ్రతుకుతున్నా..ననుతెంచకు ఓ నేస్తమా..!
గాలి పాటకు తలను ఊపుతు రాలిపోయే మూగ రాధను..!
ఓ మాధ(న)వ..! ఆడుతున్నా.. ననుతెంచకు ఓ నేస్తమా..!