గజల్ 3757.
సవాలుగా తీసుకోగ..మిగిలిందా ఏమైనా..!
ఈ ఉనికికి ఒక అర్థం..దొరికిందా ఏమైనా..!
వరములిచ్చు దైవమెవరు..లేరంటే వినవుకదా..
అంటరాని తనమన్నది..పెరిగిందా ఏమైనా..!
ఈ విశ్వం దైవమయం..ఇంతకన్న సత్యమేది..
బ్రతుకు శుద్ధ నాటకమని..తేలిందా ఏమైనా..!
లెక్కలెన్ని వేస్తావో..జన్మలెన్ని ఎత్తావో..
నాది-నేను' గొడవ సరిగ..కాలిందా ఏమైనా..!
మధుశాలకు దారిసరిగ..చూపువారు ఎవరంటా..
నిద్రమత్తు కాస్తైనా..వదిలిందా ఏమైనా..!
శవంపైని కఫనులాగ ..చెలి అశ్రువు ఇంకెందుకు..
మాధవుడే నీ తోడని..తెలిసిందా ఏమైనా..!