శీర్షిక:అమ్మ ఎందుకు పారిపోవాలి?
జీవం పోసుకున్న నేలపై
పెంచుకున్నా అభిమానం
హక్కు అనే ఆయుధంతో
స్వేచ్ఛగా ఎగురుతున్న పక్షులకు
గూడు చెదిరిపోతే....
పాముపడగలో జీవితం చిక్కుకుపోతే!
ఎటు పోవాలో దిక్కు తోచక
అల్లాడిపోతున్న ప్రాణాలవి!
తల్లి ఆవేదన చూసి బిడ్డ మదిలో
అంతుచిక్కని సందేహాలు!
ఇది మన ఇల్లే కదమ్మా!
మనకు ఎందుకు భయం?
బూచిని కొట్టేందుకు నాన్న ఉన్నాడుగా...
లోకం తెలియని పసితనం
అమాయకంగా అడుగుతున్నా ప్రశ్న!
ఆ మాట విన్న తల్లి హృదయం
సాగర ఘోషలా ప్రతిధ్వనిస్తోంది!
సాంప్రదాయల ముసుగులోని అనాగరికం
కరుణలేని రాక్షసత్వం
పురుడు పోసుకోబోతుందని!
పాషానమైన గుండెల్లో వెలసిన ఆశయం
నక్కల వలె ఊళలు వేస్తూ
నేలపైన సంచరిస్తున్నాయి!
తాలిబాన్ల రూపంలో తరుముకొస్తున్నాయని!
స్వచ్ఛమైన నీ చిరునవ్వు
కట్టుబాట్ల పేరుతో మొగ్గలోనే తుంచేస్తారని
ఆవగింజంత అనుమానం ఆయువు తీస్తుందని
ఈ దేశం ఇక గాలి వానలో చిక్కుకున్న నవాలాంటిదని
తల్లి పక్షి లేని గువ్వలమని
ఎలా చెప్పను తల్లి!
తీరాన్ని మింగేసే సునామి లా
ఆపద ముంచుకొస్తుందని
ఈ అరణ్యంలో ప్రాణానికి రక్షణ లేదని
పరాయి పంచనలో ప్రాణాలు నిలుపుకోవడమే శరణమని
చెప్పిన అర్థం చేసుకునే వయసు నీకు లేదని
ఎలా చెప్పను తల్లి!
-జ్యోతి మువ్వల
బెంగళూరు